{పభుత్వ నిర్ణయం తక్షణం అమల్లోకి
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్
బెంగళూరు: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ వెల్లడించారు. ఈ నిషేధం బుధవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుందని తెలిపారు. బుధవారమిక్కడి విధానసౌధలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలక్ట్రానిక్ సిగరెట్ల ఉత్పాదన, అమ్మకాలు, ప్రకటనలు అన్నింటినీ పూర్తిగా నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో సైతం ఎలక్ట్రానిక్ సిగరెట్ల క్రయవిక్రయాలను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు.
పొగాకు లేకుండా చార్జింగ్ ద్వారా పనిచేసే ఎలక్ట్రానిక్ సిగరెట్లు పేలిపోతుండడం, ఈ విషయంపై ఇటీవలి కాలంలో ఫిర్యాదులు అధికమవుతుండడంతో వాటిని పూర్తిగా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, రాష్ట్రంలో సిగరెట్, బీడీల అమ్మకాలను సైతం నిషేధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోందని మంత్రి యు.టి.ఖాదర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఏదైనా న్యాయసంబంధమైన ఇబ్బందులు ఎదురవుతాయేమో పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్రకు ఇప్పటికే సూచించారని చెప్పారు.