ముట్టడి
మద్రాసు ఐఐటీలోని అంబేద్కర్-పెరియార్ విద్యార్థి సంఘం గుర్తింపు రద్దు వ్యవహారం రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఆందోళనకు తెరతీసింది. ఇప్పటికే అనేక సంఘాలు ఆందోళన బాటపట్టగా, డీఎంకే, విడుదలై చిరుతైగళ్ కట్చి వేర్వేరుగా సోమవారం పోరాటాలకు దిగాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్రాసు ఐఐటీలో అనేక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉన్నతవిద్య అభ్యసిస్తున్నారు. వీరి సంఖ్యకు తగినట్లుగా అనేక విద్యార్థి సంఘాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటైన అంబేద్కర్-పెరియార్ విద్యార్థి సంఘం గత నెల ఒక సమావేశాన్ని నిర్వహించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీ పరిపాలనా తీరును తప్పుపట్టింది.
కరపత్రాలు ముద్రించి వ్యతిరేక ప్రచారం నిర్వహించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విచారణ జరిపించి సదరు విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అనేక విద్యార్థి సంఘాలతోపాటూ వివిధ రాజకీయపార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా డీఎంకే విద్యార్థి విభాగం ఐఐటీ సమీపంలోని మధ్య కైలాష్ వద్ద ఉదయం 11 నుంచి ఆందోళన చేపట్టింది. అక్కడి నుంచి ఊరేగింపుగా ఐఐటీ వద్దకు చేరుకుని ముట్టడికి ప్రయత్నించాయి.
అయితే పోలీసులు అడ్డుకుని 200 మందిని అరెస్ట్ చేశారు. తరువాత విడుదలై చిరుతైగళ్ కట్చి అధ్యక్షులు తిరుమావళవన్ నేతృత్వంలో మరో పోరాటం మొదలైంది. వీరుకూడా ఊరేగింపుగా ఐఐటీ వద్దకు చేరుకుని లోనికి చొరబడేందుకు ప్రయత్నించారు. 150 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచ్చిరాపల్లి ప్రధాన బస్‌స్టేషన్ వద్ద వీసీకే నేతలు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం రైల్వేస్టేషన్‌లో రైల్‌రోకోకు ప్రయత్నిం చారు. పోలీసులు రైల్వేస్టేషన్ ప్రవేశద్వారం వద్ద వారిని అరెస్ట్ చేశారు. తిరుచ్చిలో 200 మంది అరెస్టయ్యారు.