గొడవలు వదిలేద్దాం: షీలా | leave conflicts says sheila dixit | Sakshi
Sakshi News home page

గొడవలు వదిలేద్దాం: షీలా

Published Sun, Aug 18 2013 12:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

leave conflicts says sheila dixit


 న్యూఢిల్లీ: తదుపరి ప్రధానిగా రాహుల్‌గాంధీని చూడాలంటే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అంతర్గత ఘర్షణలను వీడి, ఐక్యంగా ఉండాలని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నారు. రాహుల్‌ను భవిష్యత్ ఆశాకిరణంగా అభివర్ణించారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) నగరంలో శనివారం నిర్వహించిన మహిళా సమ్మేళన్‌లో ప్రసంగిస్తూ ఆమె పైవిధంగా అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం విపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. ‘మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తున్నా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. లక్షలాది మందికి ప్రయోజనం కలిగించే సంక్షేమ పథకాలు, మెట్రో, రోడ్డు, రవాణా వ్యవస్థలు పనిచేస్తున్నా వాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని దీక్షిత్ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం తొలిసారిగా మున్సిపల్     ఎన్నికల్లో మహిళలకు 59 శాతం సీట్లు కేటాయించిందని వివరించారు. ఈ నెల 20న రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశంలోనే మొట్టమొదటిసారిగా తమ ప్రభుత్వం ఆహారభద్రత పథకాన్ని అమలు చేస్తోందని ప్రకటించారు.  మొత్తం 73 లక్షల మంది పేదలను మరో రెండు నెలల్లో ఆహార భద్రత పథకం కిందకు తేవాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా తొలుత 32 లక్షల మందికి భారీ సబ్సిడీతో ఆహారధాన్యాలను సరఫరా చేస్తారు.
 
 ఢిల్లీని ఆకలిరహిత నగరంగా మార్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. 73 ల క్షల మందిని వీలైనంత త్వరగా ఈ పథకం పరిధిలోకి తేవడానికి కృషి చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించామన్నారు. మహిళలను శక్తిమంతులుగా చేయడానికి కూడా ఆహారభద్రత పథకం ఉపకరిస్తుందన్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, యూపీయే చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆకాంక్ష మేరకు రూపొందించిన ఆహార భద్రత పథకం వల్ల ఢిల్లీలోని 1.32 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని షీలాదీక్షిత్ విశదీకరించారు. సోనియా స్వయంగా ఆహారభద్రత కార్డులను లబ్ధిదారులకు అందజేస్తారని చెప్పారు. మహిళలంతా తమ ఆధార్ కార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని, ఇక నుంచి ఆర్థిక ప్రయోజనాలన్నీ ఆ కార్డుల ద్వారానే అందజేస్తామని చెప్పారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం తమ ఇంట్లోనే బాలికలను తప్పకుండా బడికి పంపించి, జాతి అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలని కోరారు.
 
 బాలికల విద్యాభివృద్ధి కోసం కేంద్రం వారికి ఆకాశ్ టాబ్లెట్లను పంపిణీ చేస్తోందన్నారు. వీటిసాయంతో కావాల్సిన సమాచారాన్ని పొందడం సులువవుతుందన్నారు. మహిళలు తమ ఉజ్వల భవిష్యత్ కోసం సాంకేతిక  పరిజ్ఞానాన్ని అలవర్చుకోవడంలో ముందు ఉండాలని మంత్రి కోరారు. ‘మహిళలు ఇంటిని చక్కదిద్దుకుంటారు. వారికి అవకాశం ఇస్తే వారు దేశాన్ని కూడా ముందుకు నడిపిస్తారు’ అని అన్నారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కృష్ణ తీరథ్ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం మరిన్ని చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. మహిళా జనాభా తగ్గుదలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. భ్రూణ హత్యలను తీవ్రంగా వ్యతిరేకించారని తీరథ్ మహిళలను కోరారు.
 
 

Advertisement
Advertisement