రూ.200 కోసం స్నేహితుడి హత్య
చెన్నై: అప్పుగా తీసుకున్న రూ.200 తిరిగి చెల్లించకపోవడంతో ఆగ్రహించిన ఓ యువకుడు స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై విరుగంబాక్కంకు చెందిన జాకీర్‌హుసేన్ (22). దోమతెరలు విక్రయిస్తుంటాడు. ఇతను స్నేహితుడు శ్రీకాంత్ వద్ద కొన్ని రోజుల క్రితం రూ.200 అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించలేదు. ఈ క్రమంలో శనివారం రాత్రి మదరసా వీధిలోగల ఇంట్లో శ్రీకాంత్ (22) సహా నలుగురితో కలిసి జాకీర్ హుసేన్ మద్యం తాగారు.
మద్యం మత్తులో శ్రీకాంత్ తన బాకీ చెల్లించాలని జాకీర్ హుసేన్‌ను కోరాడు. ఈ విషయమై ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. స్నేహితులు సర్దిచెప్పినా వినకుండా శ్రీకాంత్ కత్తితో జాకీర్ హుసేన్ కడుపులో పొడిచాడు. జాకీర్ హుసేన్ రక్తపు మడుగులో అక్కడికక్కడే పడిపోగా శ్రీకాంత్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న వడపళని పోలీసులు జాకీర్ హుసేన్‌ను కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు నిందితుడు శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు.