డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు?
రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కసరత్తు
పోలింగ్ బూత్ ఫొటోలు, రూట్‌మ్యాప్‌ల సేకరణ
అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార అన్నాడీఎంకే వచ్చే ఏడాది వరకు ఆగలేక పోతోందా ? అనేక అంశాల్లో కలిసివచ్చే ఈ ఏడాది డిసెంబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతోందా ? ఇందుకు సంబంధించి రహస్యంగా ఎన్నికల అధికారులను సమాయత్తం చేస్తోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటి ఐదో ఏడు నడుస్తోంది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి అధికారం చేపట్టిన అన్నాడీఎంకే ప్రభుత్వానికి వచ్చే ఏడాది మే వరకు గడువుంది. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడి మళ్లీ నిర్దోషిగా బైటపడిన జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అమ్మ అవినీతి పరురాలు అంటూ అస్త్రాన్ని సంధించలేని స్థితిలో పడిపోయిన డీఎంకే సంపూర్ణ మద్యనిషేధాన్ని తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న అనేక మద్యం నేపథ్య సంఘటనలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశాయి. ప్రజల్లో ముఖ్యంగా మహిళలు టాస్మాక్ దుకాణాల పేరువింటే మండిపడుతున్నారు.
టాస్మాక్‌ల ముందు ఆందోళనలు నిర్వహించి మూసివేయిస్తున్నారు. ఈ దశలో తాలూకా స్థాయిలో ఎలైట్ మద్యం దుకాణాలను తెరవనున్నట్లు ప్రభుత్వం చెప్పడం అగ్గిపై ఆజ్యం పోసినట్లయింది. ఎలైట్ దుకాణాలను తెరవనిచ్చేది లేదని ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రతిజ్ఞ చేశాయి. మద్యం అమ్మకాలపై ప్రజల్లో పెల్లుబుకిన వ్యతిరేకత ను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో డీఎంకే కృతకృత్యురాలైంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు బహిరంగంగా డీఎంకేకు అభినందనలు తెలిపాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్న దశలో ముందుగానే మేలుకోవాలని అమ్మ ఆశిస్తున్నట్లు సమాచారం.
అచ్చిరాని సరి సంఖ్య:
రాజకీయాల్లో సెంటిమెంట్‌ను కొందరు తప్పనిసరిగా పాటిస్తారు. ఇందుకు జయలలిత కూడా అతీతంగా కాదని కొందరు రాజకీయ విశ్లేషకుల భావన. ముఖ్యమైన పనులు నెరవేరేందుకు సరి సంఖ్య కంటే బేసి సంఖ్యే ఫలప్రదం అని అమ్మ భావనగా అంటున్నారు. గత ఎన్నికలు జరిగి, అధికారాన్ని కట్టబెట్టిన సంవత్సరం 2011 బేసి సంఖ్య. ఇక అధికారంలో ఉండగానే అమ్మచేత రాజీనామా చేయించి జైలు పాలుచేసిన 2014 సరిసంఖ్య. అలాగే అప్పీలుపై నిర్దోషిగా తీర్పువెలువడి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టిన 2015 బేసి సంఖ్య అనేది గమనార్హం. ఈ సెంటిమెంట్ లెక్కలకు తోడుగా విపక్షాల సంపూర్ణ మద్య నిషేధం నినాదం అధికార పక్షాన్ని ఇరుకున పెట్టింది. విపక్షాలు మరింత బలపడేలోపే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాలని అమ్మ భావిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల సన్నాహాలు:
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సహజంగా నాలుగైదు నెలలకు ముందే ప్రధాన ఎన్నికల కార్యాలయం పనులు ప్రారంభిస్తుంది. ఈ అంచనా ప్రకారం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కసరత్తు రహస్యంగా సాగిపోతోంది. జూన్ నుండి ఎన్నికల పనులు వేగంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలు ఫోటోలను తీసి పంపాల్సిందిగా జిల్లా, నియోజక వర్గాల ఎన్నికల అధికార్లకు ఆదేశాలు అందాయి. మొత్తం 234 నియోజవర్గాల్లోని పోలింగ్ బూత్‌ల ఫొటోలను తీసి 20 రోజుల క్రితమే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు అందజేశారు. అన్ని పోలింగ్ బూత్‌లు, కేంద్రాలను కలుపుతూ రూట్‌మాప్ కూడా సిద్ధం చే సి వెంటనే పంపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఎన్నికల కమిషన్ పడుతున్న హడావిడిని గమనిస్తే ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు తథ్యమని అంచనా. అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ తంబిదురై గతంలో తిరుచ్చీలో జరిగిన సభలో ముందస్తు ఎన్నికలు తధ్యమని చేసిన ప్రకటన గమనార్హం.