మింగేశారు | According to the facts yesterday | Sakshi
Sakshi News home page

మింగేశారు

Published Mon, Jul 28 2014 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM

మింగేశారు

మింగేశారు

  •       ఒక్కటీ..వదల్లేదు.!
  •      జీహెచ్‌ఎంసీ పరిధిలో 169 చెరువుల్లో సర్వే
  •      మాయమైన బతుకమ్మ కుంట రికార్డులు
  •      కబ్జాకు గురైన దుర్గం చెరువు
  •      ఆనవాళ్లే లేని పెద్దబందం, ఖాజాకుంట
  •      సర్వేలో విస్తుపోయే వాస్తవాలు
  • నగరంలో చెరువులను కబ్జాదారులు మింగేస్తున్నారు.  ప్రజల ఆట, పాటల్లో భాగమైన బతుకమ్మ చెరువు రికార్డుల నుంచి మాయమైంది.. కుతుబ్‌షాహిల పాలనలో గోల్కొండకు మంచినీళ్లందించిన దుర్గం చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది.. పెద్ద బందం, ఖాజా కుంట, నాగిరెడ్డి కుంట ఇలా పలు చెరువులు ఆనవాళ్లు లేకుండా పోయాయి. చాలా చెరువుల్లో భారీ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు పుట్టుకొచ్చాయి. మాయగాళ్లు చెరువులను మింగేస్తూ కోట్లు గడిస్తుంటే.. సిటిజన్లు మాత్రం గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 169 చెరువులపై జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా సర్వే చేపట్టాయి. ఈ సర్వేలో విస్తుపోయే అంశాలు వెలుగుచూస్తున్నాయి.
     
    సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 169 చెరువులు, కుంటలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటి పరిస్థితిపై జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా సర్వే చేపట్టాయి. ఇప్పటి వరకు 133 ప్రాంతాల్లో సర్వే పూర్తయింది. పలుచోట్ల ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ఆక్రమణలకు పాల్పడితే కొన్ని చోట్ల చెరువు పరిధుల్లోనూ రైతుబజార్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ పాఠశాలలు నిర్మించారు.

    ఈ నేపథ్యంలో చెరువుల ఆనవాళ్లే లేకుండా పోయాయి. వాటిలో  పెద్దబందం(సూరారం), తూంకుంట (నిజాంపేట), నాగిరెడ్డికుంట (మంచిరేవుల), మైసమ్మకుంట (లాంకోహిల్స్), ఎర్రకుంట (ఐఎస్ సదన్), ఎర్రకుంట (లాలాపేట), ఖాజాకుంట (కూకట్‌పల్లి)లకు అలుగు కూడా లేకుండా పోయాయి. శ్యామలకుంట (అమీర్‌పేట), మాసాహెబ్‌ట్యాంక్ (విజయనగర్‌కాలనీ), నాగమయ్యకుంట (నల్లకుంట), బొగ్గులకుంట (ఆబిడ్స్)లతో పాటు మరో ఐదు చెరువులు ఆనవాళ్లు లేకుండా పోయాయి.   అంబర్‌పేటలోని బతుకమ్మకుంట రికార్డులు గల్లంతయ్యాయి. సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 32 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మకుంట ఉండగా, హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం మాత్రం అక్కడ చెరువు ఉన్న దాఖలాలే లేవంటూ రెండేళ్ల క్రితం తేల్చింది.

    అయితే తాజాగా నీటిపారుదల శాఖ చేపట్టిన సర్వేలో బతుకమ్మకుంట అలుగు, తూము, వరద కాలువను గుర్తించి 17 ఎకరాల్లో హద్దులు నిర్ధారించారు. బతుకమ్మకుంటపై న్యాయస్థానాలతో పాటు, లోకాయుక్తలోనూ పలు వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి. నీటిపారుదల శాఖ నోటిఫై చేసిన 17 ఎకరాల్లో ప్రస్తుతం మూడు ఎకరాల విస్తీర్ణం మాత్రమే ఖాళీగా ఉండడం గమనార్హం. ఖాజాగూడ, బందం చెరువు అలుగు మొత్తం ఓ సినీ నిర్మాత ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇది గుర్తించిన అధికార యంత్రాగం సదరు నిర్మాతకు త్వరలో నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది.
     
    జీహెచ్‌ఎంసీ పరిధిలో 169 చెరువులను గుర్తించిన యంత్రాంగం వాటి పూర్తి స్థాయి నీటిమట్టాలను (ఎఫ్‌టీఎల్) గుర్తించే పనిని దాదాపు పూర్తి చేసి జీపీఎస్ సహాయంతో శాశ్వత మార్కింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం శాస్త్రీయపద్ధతిలో చేస్తున్న ఎఫ్‌టీఎల్ మార్కింగ్‌ను భవిష్యత్తులో ఎవరికి వారు మార్పు చేసేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
     
    కబ్జా కోరల్లో...

    దుర్గం చెరువులో 30 ఎకరాల్లో భారీ నిర్మాణా లు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వచ్చినట్లు సర్వేలో తేలిం ది. కుతుబ్‌షాహీల కాలంలో గోల్కొండ కోటకు మంచినీటిని అందించేందుకు 160.7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన దుర్గం చెరువు తాజా సర్వేల్లో 30 ఎకరాలకు పైగా కబ్జాకు గురైనట్లు అంచనాకు వచ్చారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో సుమారుగా రూ. 100 కోట్లకు పైగా విలువైన క్రయవిక్రయాలు జరిగినట్లు భావిస్తున్నారు. జీపీఎస్ సాయంతో ఇప్పటికే ఎఫ్‌టీఎల్ హద్దులను నిర్ధారించిన అధికారులు చెరు వు తూమును ఇటీవలే మూసేశారు. దీంతో పక్షం రోజులుగా దుర్గం చెరువులోకి వస్తున్న వరద నీటితో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం వచ్చేంత వరకు తూమును మూసెయ్యాలని నీటిపారుదల శాఖ నిర్ణయించడంతో చెరువు సమీపంలోని భవనాల్లోకి వరద నీరు క్రమంగా చేరుతోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement