కాంగ్రెస్ మునుగుతున్న నావ
అగ్ర నేతల తీరు బాధిస్తోంది
- డీసీసీ అధ్యక్షుడి తీరు పార్టీకి నష్టం
- జిల్లా, రాష్ట్ర నేతలపై ‘మడత’ ఫైర్
- త్వరలో కాంగ్రెస్‌కు మడత - వెంకటగౌడ్ రాజీనామా...?
ఇల్లెందు : అసెంబ్లీ , మున్సిపల్ ఎన్నికల్లో ఏ ఒక్క అగ్ర నేత ఇల్లెందు వైపు తిరిగి చూడలేదు. పైసా పార్టీ ఫండ్ ఇవ్వలేదు. మా సొంత డబ్బులతోనే ఎమ్మెల్యేను, ఎంపీటీసీలను, సర్పంచ్‌లను, జడ్పీటీసీలను, మున్సిపల్ కౌన్సిలర్‌లను గెలిపించుకున్నాము. అయినా ఏడాది కాలంలో ఒక్క నాయకుడు కూడా ఇల్లెందు వైపు తిరిగి చూడలేదు. స్థానిక నాయకత్వాన్ని సంప్రదించకుండా ఏకంగా డీసీసీ అధ్యక్షుడు ఐతా సత్యం ఓ కౌన్సిలర్‌కు మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ పదవీ కట్టబెడుతూ లేఖ పంపించటం తమను బాధకు గురి చేసిందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు మడత వెంకట్‌గౌడ్ అన్నారు. గురువారం సాయంత్రం ఆయ న స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ జిల్లా, రాష్ట్ర నేతలపై మాజీ మంత్రులపై ఆయన ఫైర్ అయ్యారు.
ఇల్లెందు నియోజకవర్గంలో సమష్టి కృషితో ఎంపీటీసీ, జడ్పీటీసీల నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌ల వరకు 40 మంది ప్రజాప్రతినిధులను గెలిపించుకు ని బలమైన పార్టీగా నిలిపినట్లు ఆయన తె లిపారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిని, పార్టీ నుంచి బహిష్కరించిన వారిని ప్లీనరీకి హాజరయ్యే పాస్‌లు ఇచ్చి కష్టపడి పని చేసిన వారికి పాస్‌లు ఇవ్వకుండా అవమాన పర్చారని అన్నారు. అలాంటి సందర్భంలోనే ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆనాడే ప్లీనరీ నిండు సభలో పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారని, కనకయ్య పార్టీ వీడటానికి అప్పటి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కారణమన్నారు.
కనకయ్య వెళ్లిన ఏడాది కా లంగా ఇల్లెందు నియోజకవర్గంలో పార్టీ ని కాపాడుకునేందుకు అగ్ర నేతలు ఎం దుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. రెండు నెలల క్రితం పీసీసీ అధ్యక్షుడు భట్టి, రాంరెడ్డి, వనమా ఇల్లెందు వచ్చినప్పడు మున్సిపల్ చైర్మన్‌ను ఆహ్వానించకుండా, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సభ నిర్వహించటంతో తాము తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిపారు. తాజాగా మున్సిపల్ కౌన్సిలర్‌లను, చైర్మన్‌ను సంప్రదించకుండా ఫ్లోర్‌లీడర్ ఎంపిక పత్రం ఇవ్వటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. అగ్ర నేతల తీరుతో మనస్థాపానికి గురైన తాము త్వరలో కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మడత రమా, కౌన్సిలర్‌లు బొబ్బిలి అజయ్‌కుమార్, బానోత్ రవినాయక్, కమల్‌కోరీ, కొనకంచి పద్మ, స్వర్ణలత, కొప్పుల తిరుపతిరావు, పర్రె శ్రీనివాస్, మన్నాన్, రాంజీ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.