గాంధీ ఆస్పత్రి వార్డుల్లో ఖాళీగా పడకలు
గాంధీఆస్పత్రి: ప్రాణాంతకమైన కోవిడ్ వైరస్‌ను నియంత్రించేందుకు రానున్న మూడు వారాలే అత్యంత కీలకమని, మూడో దశకు వెళ్తే మృత్యు ఘంటికలు మోగుతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో రెండురోజులుగా లోకల్ కాంటాక్టు ద్వారా ఐదు పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. తెలంగాణలో మొత్తం 39 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ, చెస్ట్ ఆస్పత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో 26 మంది బాధితులు వైద్య చికిత్సల అనంతరం కోలుకుంటున్నారని, బీపీ, సుగర్ నార్మల్‌గా ఉన్నాయని, వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని ట్రీటింగ్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రానున్న మూడు వారాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలంతా హోం క్వారంటైన్‌లో ఉండాలని, స్వీయరక్షణపై మరింత శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కోవిడ్ పాజిటివ్ వచ్చినవారిలో 34 మంది విదేశీయులతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చినవారు, ఐదుగురు స్థానికులు (లోకల్ కాంటాక్టు ) ఉన్నారని, ఈ పరిస్థితిని స్టేజ్ 2గా పరిగణిస్తారని, ఇక్కడి పరిస్థితులు, ఉష్ణోగ్రతలకు తట్టుకునేలా కోవిడ్ వైరస్ రూపాంతరం చెంది, స్థానిక ప్రజల్లో వ్యాపిస్తే స్టేజ్ 3కి చేరినట్లేనన్నారు. ఇదే జరిగితే పెద్దసంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. స్టేజ్– 3లో వృద్ధులు, ఇతర రుగ్మతలు, వ్యాధులతో బాధపడేవారికి కోవిడ్ వైరస్ సులభంగా సోకే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. వృద్ధులు,బాలింతలు, గర్భిణులు, చిన్నారులు, వివిధ రుగ్మతలతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కీలకమైన ఈ మూడు వారాలు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని విజయవంతంగా నివారించవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.
తక్షణమే డిశ్చార్జి చేయండి సారూ..
నోడల్ కేంద్రమైన గాంధీఆస్పత్రిలో సాధారణ చికిత్సలు కోసం ఇన్‌పేషెంట్లుగా చేరిన రోగులు ఇకపై గాంధీ ఉండమని, తక్షణమే డిశ్చార్జి చేయాలంటూ సంబంధిత వైద్యులను కోరుతున్నారు. మూడు రోజుల క్రితమే గాంధీ ఓపీ విభాగం మూసివేసిన సంగతి విదితమే. సర్జరీలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రతి నిత్యం 2000 నుంచి 2,500 వేల మంది ఉండే ఇన్‌పేషెంట్ విభాగంలో రోగులు çసంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మరికొన్ని రోజుల్లో సాధారణ రోగులను డిశ్చార్జి చేసి కేవలం కోవిడ్ బాధితులు, అనుమానితుల కోసమే గాంధీ ఆస్పత్రిని సిద్ధం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
బాధితులు కోలుకుంటున్నారు..
గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న 26 మంది కోవిడ్ బాధితులు వైద్యసేవల అనంతరం కోలుకుంటున్నారని కోవిడ్ కన్వీనర్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. ఐసోలేషన్ వార్డులో అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించామని, ఆహ్లాదకరమైన వాతావరణంలో బాధితులంతా కోలుకుంటున్నారని, ఐసోలేషన్‌లో చేరిన నాటి నుంచి 14 రోజుల గడువు ముగిసిన వారికి రెండు దఫాలుగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వస్తే డిశ్చార్జి చేస్తామన్నారు.
కోవిడ్ ఓపీ 211.. ఐసోలేషన్‌లో 35 మంది..
గాంధీ ఆస్పత్రి కోవిడ్ ఓపీ విభాగానికి అనుమానితులు క్యూ కడుతున్నారు. బుధవారం ఓపీ విభాగానికి 211 మంది రాగా, వీరిలో 35 మందిని గుర్తించి ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేసి నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపినట్లు నోడల్ అధికారి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం అందిన నివేదికల్లో 60 మందికి కోవిడ్ నెగిటివ్ రావడంతో వారికి జాగ్రత్తలు చెప్పి డిశ్చార్జి చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment