వీడనున్న బంధం | caved zone people's concern on polavaram ordinance | Sakshi
Sakshi News home page

వీడనున్న బంధం

Published Tue, Jul 15 2014 2:49 AM | Last Updated on Fri, Aug 24 2018 2:01 PM

వీడనున్న బంధం - Sakshi

వీడనున్న బంధం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉన్న ఒక్క ఆశా... ఆవిరైపోయింది. రాజ్యసభలో అధికార పక్షం సంఖ్య తక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడయినా పోలవరం ముంపు ఆర్డినెన్స్ ఆగుతుందేమోనని ఆశించిన ఆదివాసీలకు ఇక్కడా భంగమే ఎదురైంది. సోమవారం రాజ్యసభ కూడా ముంపు ఆర్డినెన్స్‌కు మూజువాణీ ఓటుతో ఆమోదం తెలి పింది. దీంతో బిల్లు చట్టబద్ధతకు లైన్‌క్లియర్ అయినట్టయింది. ఇక రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఒక్క సంతకం పెడితే బిల్లుకు చట్టబద్ధత లభిస్తుంది.

చట్టబద్ధత లభించిన వెంటనే అధికారికంగా జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తాయి. భద్రాచలం, కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు, వీఆర్ పురం, కూనవరం, బూర్గంపాడు మండలాలను (భద్రాచలం రెవెన్యూ గ్రామం, బూర్గం పాడు 12 గ్రామాలు మినహా) పక్క రాష్ట్రానికి బదలాయిస్తారు. దీంతో పాటు దాదాపు రెండు లక్షల మంది ప్రజలు, లక్షల ఎకరాల భూమి, అటవీ సంపద, అడవి తల్లి అందాలు, సీలేరు విద్యుత్ కేంద్రం, అన్నింటికీ మించి జిల్లాతో ఆదివాసీలకు అల్లుకున్న అపురూపం బంధం... అన్నీ వీడిపోనున్నాయి.
 
పట్టించుకోని కేంద్రం...
వాస్తవానికి ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌కు ప్రజల మద్దతు లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలు మునిగిపోతాయని, మునిగే గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపితే పునరావాసం సమస్య ఎదురవుతుందనే సాంకేతిక కారణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల గోడు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. తరతరాలుగా గోదారి ఒడిలో బతుకు నావను నడిపిన ఆదివాసీ గిరిజనుల భవిష్యత్తును ఫణంగా పెట్టి బిల్లును ఆమోదించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

రాజ్యసభలో పెట్టిన బిల్లును తెలంగాణ ప్రాంతానికి చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకించారు. అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్రప్రాంత సభ్యులు మాత్రం మద్దతు తెలిపారు. మరోవైపు తాము తయారుచేసిన ఆర్డినెన్సే కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారికంగా బిల్లుకు మద్దతు తెలిపింది. దీంతో సభలో ఓటింగ్ అడిగినప్పటికీ పట్టించుకోని డిప్యూటీ చైర్మన్ కురియన్ మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించారు.
 
 స్థానిక సంస్థలు, ప్రతినిధుల సంగతేంటో..?
 ముంపు ప్రాంతం బదలాయింపునకు చట్టబద్ధత లభిస్తోంది కానీ, ముంపు ప్రాంతంలో ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు, ఇతర సొసైటీల చైర్మన్లు, సభ్యుల పరిస్థితేంటో అర్థం కావడం లేదు. జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళుతున్న ఏడు మండలాల్లో ఐదింటికి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించారు. ఇక ఈ ఏడు మండలాల్లో సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు. మరి, ఈ మండలాలు ఉభయగోదావరి జిల్లాల్లో కలిస్తే వీరి పదవులు ఉంటాయా, వీరిని అక్కడి స్థానిక ప్రభుత్వాలలో ఎలా విలీనం చేసుకుంటారన్నది ప్రశ్న.
 
ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల్లో జడ్పీచైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. మరి అక్కడి జడ్పీటీసీలను ఏ విధంగా జిల్లా పరిషత్ కౌన్సిల్‌లో కలుపుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. అలా కలుపుకున్నా అక్కడి బలాబలాల్లో కూడా తేడాలు వస్తాయి. మరోవైపు ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో కోర్టు కేసు కారణంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ఆ మండలాలు గోదావరి జిల్లాలకు వెళ్లిపోతే అక్కడయినా ఎంపీపీలు, వైస్ ఎంపీపీల ఎన్నికలు జరుగుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ముంపు మండలాలను, అందులోని గ్రామాలను జిల్లా పరిషత్ చట్టం ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి ఆంధ్రలో కలుపుకోవాల్సి ఉంటుంది.
 
ఈ నోటిఫికేషన్‌లోనే ఏ మండలాన్ని, ఏ గ్రామాన్ని ఏ డివిజన్‌లో, ఏ మండలంలో కలుపుతారు అనేది తెలియజేస్తారు. అలా చట్టం ద్వారా సంక్రమించిన అధికారంతో బదలాయించుకున్న స్థానిక ప్రభుత్వాలను అక్కడి స్థానిక ప్రభుత్వాలతో ఎలా కలుపుకుంటారనేది తేలాల్సి ఉంది. మరోవైపు పలు సంక్షేమ పథకాల అమలు, రేషన్, పింఛన్ల పంపిణీ, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, ఐటీడీఏ బదలాయింపు లాంటి అంశాలన్నింటిలో ఎప్పుడు స్పష్టత వస్తుందో చెప్పలేమని జిల్లా యంత్రాంగం చెబుతుండడం ఆదివాసీలకు ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement