కరోనా కేసులింకా పెరుగుతాయ్‌.. | Coronavirus Cases Increase More And More Says Srinivas Rao | Sakshi
Sakshi News home page

కరోనా కేసులింకా పెరుగుతాయ్‌..

Published Sun, May 31 2020 1:38 AM | Last Updated on Sun, May 31 2020 1:38 AM

Coronavirus Cases Increase More And More Says Srinivas Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజా ఆరోగ్యశాఖ సంచాలకుడు జి.శ్రీనివాసరావు వెల్లడించారు. లాక్‌డౌన్‌ సడలింపులతో జనం రోజు వారీ కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటుండటంతో వైరస్‌ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉందని, ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. శనివారం వైద్య విద్య సంచాలకుడు రమేష్‌రెడ్డితో కలిసి కోఠి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పక్కాగా అమలైందని, అందువల్లే కరోనా అదుపులో ఉందన్నారు. లాక్‌డౌన్‌ లక్ష్యం కరోనాను నిర్మూలించడం కాదని, ప్రజలకు అవగాహన కల్పించి జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టడం కోసమన్నారు. దీర్ఘకాల లాక్‌డౌన్‌తో తీవ్ర నష్టమని, అందుకే విడతల వారీగా సడలింపులు ఇస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసులు, మరణాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగానే వైద్య పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు.

పరీక్షలు, కేసుల నమోదు అంశాలు దాచినా దాగేవి కావన్నారు. అవసరం ఉన్న వారికే నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంటూ ఇప్పటివరకు రాష్ట్రంలో 30వేలకుపైగా పరీక్షలు చేశామని, 2వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ప్రతి ఒక్కరూ కరోనా వైరస్‌ కట్టడికి మూడు సూత్రాలు పాటించాలని జి.శ్రీనివాసరావు సూచించారు. బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతికదూరాన్ని పాటించాలని, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇవి పాటిస్తే కరోనా వైరస్‌ బారి నుంచి తప్పించుకున్నట్టేనన్నారు. రాష్ట్రంలో కేసుల నమోదు తీరును పరిశీలిస్తే.. జనసమూహాలు ఏర్పడిన చోటే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. ఒడిబియ్యం, పుట్టినరోజు వేడుకల వంటి కార్యక్రమాల వల్లే ఒకే కుటుంబానికి చెందిన పలువురు వైరస్‌ బారిన పడ్డారన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ గెలిచిందని, ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉంటే కరోనాపై విజయం సాధిస్తామన్నారు.

భవిష్యత్తులో ఊపిరితిత్తులపై ప్రభావం: రమేష్‌రెడ్డి
కరోనా వైరస్‌ నుంచి బాధితుడు కోలుకున్నా.. దీర్ఘకాలిక ఇబ్బందులు తప్పవని వైద్య విద్య సంచాలకుడు రమేష్‌రెడ్డి చెప్పారు. వైరస్‌ ప్రభావం ఊపిరి తిత్తులపై ఉంటుందని, కొన్నేళ్ల తర్వాత అది బయటపడొచ్చన్నారు. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి చికి త్స చేసే క్రమంలో వెంటిలేటర్‌ అవసరం చాలా తక్కువన్నారు. 5శాతం మందికి మాత్రమే ఇది వాడాల్సిన అవసరం వచ్చిందన్నారు. లాక్‌డౌన్‌ సడలింపులతో కేసుల తీవ్రత పెరుగుతుందని ముందే ఊహించామని, ఇందులో భాగంగా వసతులు, సౌకర్యాలు కల్పించి ఎక్కువమందికి చికిత్స అందేలా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో 170 వెంటిలేటర్లు ఏర్పాటు చేశామని, కింగ్‌కోఠి ఆస్పత్రి, టిమ్స్‌ తదితర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో చికిత్స చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా వైరస్‌కు చికిత్స తీసుకున్న 7రోజుల తర్వాత బాధితుడి నుంచి మరొకరికి వైరస్‌ సోకదని, తొమ్మిదో రోజు అతడిలో వైరస్‌ కణాలు నశిస్తాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement