సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో చిత్రం ఇదే..
సాక్షి, సిటీబ్యూరో: రహదారులను పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తున్న ఓవర్‌లోడ్ లారీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నగరానికి చెందిన ఓ కార్పొరేటర్ ఇబ్రహీంపట్నం ఆర్టీఏ అధికారులను వేడుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్ద అంబర్‌పేట్ వద్ద సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్న మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ సాయిబాబా కాళ్లపైన పడి అభ్యర్ధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పరిమితికి మించిన బరువుతో ప్రతిరోజూ వందలకొద్దీ లారీలు ఔటర్‌రింగ్ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయని, దీంతో రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమవుతున్నాయని హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పలుమార్లు ఇబ్రహీంపట్నం ఆర్టీఏ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. సోమవారం కంకర, డస్ట్ లారీల అసోసియేషన్‌లతో కలిసి పెద్ద అంబర్‌పేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ క్రమంలో ఆ రహదారిపై అధికలోడ్‌తో లారీలు వెళ్తున్నాయని ఆర్టీఏ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో ఎంవీఐ సాయిబాబా ఆధ్వర్యంలో ఆర్టీఏ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఓవర్‌లోడ్ లారీలు రాకపోకలు సాగిస్తున్నాయని, వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కార్పొరేటర్ అధికారులను నిలదీశారు. అనేకసార్లు అధికారులను కలిశామని, ఇప్పటికైనా వాటిని అడ్డుకోవాలని కోరుతూ ఎంవీఐ సాయిబాబా కాళ్లపై పడ్డారు. ఇదంతా వీడియోలో రికార్డు చేసి వాట్సప్, ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఓవర్‌లోడ్ వాహనాలపైన త్వరలోనే మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డిలను సైతం సంప్రదించనున్నట్లు ఈ సందర్భంగా కార్పొరేటర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. తాము ఓవర్‌లోడ్ వాహనాలను ఏ మాత్రం ఉపేక్షించడం లేదని, ఇప్పటి వరకు 300కుపైగా వాహనాలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని ఇబ్రహీంపట్నం ప్రాంతీయ రవాణా అధికారి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment