
సాక్షి, హైదరాబాద్: దేశంలో గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో చాలా రాష్ట్రాలు అతలాకుతలం అయిన నేపథ్యంలో..ఈ ఏడాది అలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నదీ బేసిన్‌ల పరిధిలో గుర్తించిన వరద ప్రభావిత ప్రాంతాల పరీవాహక రాష్ట్రాలను ముందుగానే మేల్కొలిపే చర్యలకు దిగింది. గతేడాది మాదిరే ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అందుకు తగ్గట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలంది. వాతావరణ పరిస్థితి, వర్షపాతం, ప్రాజెక్టుల్లో చేరుతున్న ప్రవాహాలు, నదుల్లో నమోదవుతున్న వరద, రిజర్వాయర్‌లలో నిల్వల సమాచారాన్ని పరీవాహక రాష్ట్రాలతో పంచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిద్వారానే విపత్తు నిర్వహణ సాధ్యమవుతుందని వెల్లడించింది.
గత భయానక అనుభవాల దృష్ట్యానే..
దేశ వ్యాప్తంగా గతేడాది భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర, అస్సోం, కేరళ, ఉత్తరాఖండ్, పంజాబ్, బిహార్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నదులు, రిజర్వాయర్లు అధిక వర్షాలతో ఉప్పొంగాయి. అధికంగా నమోదైన ఈ వర్షపాతాన్ని అంచనా వేయడంలో విఫలం కావడంతో చాలా రాష్ట్రాల్లో ప్రాజెక్టుల కింద తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సం భవించింది. దీంతోపాటే ఎగువ రాష్ట్రాలు ఎప్పటికప్పుడు వరద సమాచారాన్ని దిగువ రాష్ట్రాలకు ఇవ్వడంలో చూపిన నిర్లక్ష్యం, పూర్తిగా ప్రాజెక్టుల గేట్లు ఎత్తేవరకు దిగువ ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తం చేయకపోవడం, ప్రధాన నదుల్లో కలిసే ఉపనదుల ప్రవాహా సామర్థ్య లెక్కలు గణించే యంత్రాంగం లేకపోవడంతో ముంపు ప్రభావం దిగువ రాష్ట్రాలపై అధికంగా పడింది.
దక్షిణాదిలో కృష్ణా బేసిన్‌లోనే ఆల్మట్టి రిజర్వాయర్‌కు ఒకే రోజులో 10 లక్షలకు మించి వరద రావడం, ఎగువ మహారాష్ట్ర నుంచి వచ్చే వరదలపై సరైన అంచనా లేకపోవడంతో దిగువ ప్రాం తాలు ముంపునకు గురయ్యాయి. తుంగభద్ర నదిలోనే అకస్మాత్తుగా వచ్చిన వరదతో మహ బూబ్‌నగర్ జిల్లాలో, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. కృష్ణాబేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టుకు గతం కంటే భిన్నంగా ఆగస్టు నెలలో కేవలం 25 రోజుల్లో ఏకంగా 865 టీఎంసీల మేర వరద వచ్చింది. దీన్ని నియంత్రించేందుకు ఎగువ రాష్ట్రాలతో సమన్వయం అత్యంత కీలకమైంది.
సమాచారం ఇచ్చిపుచ్చుకునేలా...
ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ గుర్తించిన నదీ బేసిన్‌లు, ప్రాజెక్టులతోపాటు ఏవైనా ముప్పు ప్రాంతాలు ఉన్నట్లయితే వాటి వివరాలను తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ముఖ్యంగా వారం కిందట కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ బేసిన్లోని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో ఇక్కడి హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ అధికారులు సమీక్షించారు. వరదలపై పొరుగున ఉన్న, లేక ఆ బేసిన్ పరీవాహకం ఉన్న రాష్ట్రాలతో మిగతా రాష్ట్రాలు సమాచార మార్పిడి చేసుకోవాలని, ప్రాజెక్టుల నీటి నిల్వ, ప్రవాహాల పరిస్థితులను ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలకు తెలియజేయాలని ఆదేశించారు.
వాతావరణ, విపత్తు నిర్వహణ, నీటి పారుదల శాఖల మధ్య సమన్వయం ఉండేలా లైసెన్సింగ్ అధికారులను నియమించాలని, వారి ఫోన్ నంబర్లను అన్ని రాష్ట్రాల అధికారులకు అందు బాటులో ఉంచాలని సూచించారు. ఇక రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి, కడెం, మూసీ, మున్నేరు, ప్రాణహిత, ఇంద్రావతి తదితర బేసిన్‌ల పరిధిలోని ప్రాజెక్టుల వరదపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, నిజాంసాగర్, సింగూరు, శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి, తుపాకులగూడెం, మూసీ ప్రాజెక్టులపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఆటోమేటిక్ రెయిన్ గేజ్ స్టేషన్లు, ఆటోమేటిక్ వాటర్ లెవల్ రికార్డులు, డిజిటల్ వాటర్ లెవల్ రికార్డుల ఏర్పాటు పక్కాగా ఉండాలని తెలిపారు.
కాళేశ్వరం పరిధిలో 15 గేజ్ మీటర్లు..
ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఏడాదికి కనీసం 530 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళిక వేస్తోంది. ఇందులో ప్రధానంగా వరద అంచనా, మోటార్ల ఆపరేషన్‌కు వీలుగా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సెన్సార్ల ద్వారానే గోదావరి ప్రవాహ సామర్థ్యాన్ని అంచనావేసేలా 15 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. సీడబ్ల్యూసీ వద్ద జరిగిన సమీక్షలో మేడిగడ్డ బ్యారేజీతో పాటు కంతనపల్లి వద్ద నమోదయ్యే ప్రవాహ లెక్కలను ఎప్పటికప్పుడు తెలిపేందుకు తెలంగాణ అధికారులు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment