సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జనలు పడుతోంది. ఈ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీ తీసుకోబోయే నిర్ణయంపై కాంగ్రెస్ నేతల్లోనే పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి, ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నందున తెలుగుదేశం పార్టీతో కలిపితే కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. కానీ, తమ అభ్యర్థిని బరిలోకి దింపితే అధికార టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అమలుపరుస్తారు? ఆపరేషన్ ఆకర్ష్ అప్పుడే మొదలుపెడితే పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా చేజారుతారా? అలా జరిగితే తర్వాతి పరిణామాలు పార్టీపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? కౌన్సిల్ నుంచి పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు రిటైర్ అవుతున్నందున పోటీకి నిలపకపోతే కౌన్సిల్‌లో ప్రాతినిథ్యం లేకుండా పోతుందా? అన్ని స్థానాలు టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవమయ్యేలా పోటీ నుంచి తప్పుకోవడం రాజకీయ తప్పిదమవుతుందా? అనే సందేహాలు ఆ పార్టీ నేతల్లో మొదలయ్యాయి.
టీడీపీతో కలిసి వెళ్లేలా..
రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో నామినేటెడ్ ఎమ్మెల్యే కలిపితే మొత్తం 120 మంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈదఫా ఐదు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు షెడ్యూల్ విడుదల అయినందున ఒక్కో ఎమ్మెల్సీకి మొదటి ప్రాధాన్యత ఓటు కింద 24 ఓట్లు అవసరం అవుతాయి. అయితే, ఐదు నామినేషన్లే వస్తే అన్నీ ఏకగ్రీవమవుతాయి కనుక అప్పుడు ప్రాధాన్యత ఓట్లు, పోలింగ్ అవసరం ఉండదు. కానీ, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా నామినేషన్ వేసి, టీఆర్‌ఎస్ ఐదుగురు అభ్యర్థులను బరిలో దింపితే ప్రాధాన్యత ఓటు విలువ తగ్గిపోతుంది. మొత్తం ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉంటారు కనుక 120 మంది ఎమ్మెల్యేలను ఆరుగురికి పంచితే 20కి పడిపోతుంది. 20 కన్నా ఒక ఓటు ఎక్కువగా.. అంటే 21 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు. ఆ లెక్కన చూస్తే కాంగ్రెస్ 19, టీడీపీ 2 కలిపితే 21 మంది ఎమ్మెల్యేలవుతారు. ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని వెళ్లారు కనుక ఆ రెండు పార్టీలు కలిసి అభ్యర్థిని నిలిపినా ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయితే, ఆ సాహసానికి కాంగ్రెస్ సిద్ధమవుతుందా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఒక్క ఎమ్మెల్సీనైనా దక్కించుకోవాల్సిందే..
మరోవైపు, ప్రస్తుతం మండలి నుంచి రిటైర్ అవుతున్న షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు కూడా లేకపోతే మండలిలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. అలాంటి సందర్భంలో అవకాశం ఉన్న ఒక్క ఎమ్మెల్సీనయినా దక్కించుకోవాల్సిందే అన్న అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. ‘టీఆర్‌ఎస్‌కు ఐదు స్థానాలు గెలిచే బలం లేదు. వారు నాలుగు, మేం ఒక్క స్థానంలో నామినేషన్లు వస్తే న్యాయబద్ధంగా ఉంటుంది. అలా కాకుండా టీఆర్‌ఎస్ ఐదుగురు అభ్యర్థులను బరిలో దింపితే మాత్రం మేం కూడా పోటీలో ఉంటాం. ఏం జరిగితే అది జరుగుతుంది. మండలిలో కనీస ప్రాతినిథ్యం లేకుండా టీఆర్‌ఎస్‌కు అన్ని స్థానాలు ఏకగ్రీవంగా వదిలేసే రాజకీయ తప్పిదం మేం చేయలేం’అని మరో టీపీసీసీ నాయకుడు అభిప్రాయపడటం గమనార్హం. ఈ నేపథ్యంలో టీపీసీసీ పెద్దలు, కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? పార్టీ తరఫున అభ్యర్థిని బరిలో ఉంచడం ద్వారా మరోసారి రాష్ట్ర రాజకీయాన్ని కాంగ్రెస్ రసకందాయంగా మారుస్తుందా? టీఆర్‌ఎస్ స్వచ్ఛందంగా నలుగురు అభ్యర్థులకే పరిమితం అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే!
ఎమ్మెల్యేలు జారిపోతారేమో
కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెడితే ఎలాంటి పరిణామాలుంటాయనే దానిపై ఆ పార్టీలోనే ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆ పార్టీ తరఫున ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలు పార్టీకి కట్టుబడి ఉంటారా లేదా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ పక్షాన విప్ జారీ చేసినప్పటికీ టీఆర్‌ఎస్ పక్షం నుంచి ఏదైనా ఆపరేషన్ జరిగితే మాత్రం చేజారిపోతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉం దని, పార్టీ ఎమ్మెల్యేలంతా పార్టీకి టచ్‌లో ఉన్నారని, మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉంటే వారి ఆలోచనల్లో మార్పు వస్తుందని, ఎవరైనా పొరపాటున ప్రలోభాలకు లొంగితే పార్టీకి పూడ్చుకోలేని నష్టం కలుగుతుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే, తమ పార్టీ ఎమ్మెల్యేలు అంత సులువుగా టీఆర్‌ఎస్ గూటికి వెళ్లబోరని ఆయన ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. వీరికి తోడు టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ అభ్యర్థికి బాసటగా నిలుస్తారని అంటున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఇద్దరిలో ఒక ఓటు అనుమానమేనన్న అభిప్రాయం కూడా నేతల్లో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment