సాక్షి, హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలసి ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికలను సవాలుగా తీసుకోవాలని, జూలైలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పారు. ‘జూలై నెలాఖరులోపు పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలి. వచ్చే ఏడాది ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ పెద్ద సవాలు. ఈ ఎన్నికల్లో 1.37 కోట్ల మంది ఓటర్లు పాల్గొంటారు.
పశ్చిమ బెంగాల్ పంచా యతీ ఎన్నికల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా 30 మంది చనిపోయారు. మన రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ చాలా సమర్థంగా ఉంటుంది. ఏడాది క్రితం నుంచే ఎన్నికల నిర్వహణ కసరత్తు ప్రారంభించాం. రెండు నెలల్లో కొత్తగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పటిష్ట ప్రణాళికలు రూపొందించాలి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలి. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను తీసుకురావాలి. ఇప్పటికే ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. జూన్ 15లోపు ముద్రణ సామగ్రి సిద్ధమవుతుంది. బ్యాలెల్ పత్రాల ముద్రణ జిల్లాల్లోనే పూర్తి చేయాలి. సిబ్బంది నిర్వహణ మినహా అన్ని పనులను జూన్ 10లోగా పూర్తి చేయాలి’అని నాగిరెడ్డి వివరించారు. ఎన్నికల దృష్ట్యా గ్రామపంచాయతీ కార్యదర్శుల బదిలీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికల తర్వాతే బదిలీలు ఉంటాయని స్పష్టం చేశారు.
నిర్లక్ష్యంగా ఉండొద్దు
కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాలు, కొత్త పంచాయతీల్లో మొదటిసారి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎన్నికల నిర్వహణ తీరు భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు బెంచ్ మార్క్‌గా ఉండాలి. అధికారులు, సిబ్బంది వ్యక్తిగత ఇగోలను పక్కనబెట్టాలి. ఎన్నికల నిర్వహణలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. –ఎస్.కె.జోషి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ప్రణాళిక ఉండాలి
గ్రామాల్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. గ్రామాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం వచ్చేలా పోలీస్ అధికారులు అందరినీ సమన్వయం చేసుకోవాలి. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలకు అనుగుణంగా ప్రణాళికలను పునర్వ్యవస్థీకరించుకోవాలి. పనితీరు ఆధారంగా అధికారులకు బాధ్యతలు అప్పగించాలి. –డీజీపీ మహేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment