కరోనా: జిల్లాలో తొలి కేసు | First Corona Case Filed In Nirmal District | Sakshi
Sakshi News home page

కరోనా: జిల్లాలో తొలి కేసు

Published Fri, Apr 3 2020 9:10 AM | Last Updated on Fri, Apr 3 2020 2:11 PM

First Corona Case Filed In Nirmal District - Sakshi

జోహ్రానగర్‌లో పర్యటిస్తున్న కలెక్టర్‌

సాక్షి, నిర్మల్‌ : ‘ఎక్కడో ఉందనుకుంటున్న వైరస్‌ ఇప్పుడు మన మధ్యలోకి వచ్చేసింది. జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. జిల్లాకేంద్రానికి చెందిన సదరు వ్యక్తి మృతి చెందాడు. ఇక జిల్లా మరింత జాగ్రత్త పడాలి. అత్యవసరమైతే తప్ప ఇంటి గడప దాటొద్దు. నాలుగు రోజులపాటు జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాం. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మహమ్మారిని కట్టడి చేసేందుకు జిల్లా వాసులు అందరూ సహకరించాలి..’ అంటూ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖి కోరారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో జిల్లాకేంద్రానికి చెందిన ఇసాక్‌ అలీ కరోనా లక్షణాలతో మృతిచెందినట్లు ఆయన ప్రకటించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కరోనా ప్రభావిత జోన్‌గా నిర్మల్‌..
నిర్మల్‌ పట్టణానికి చెందిన సయ్యద్‌ ఇసాక్‌అలీ అనే వ్యక్తి బుధవారం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్‌తో మరణించినట్లు కలెక్టర్‌ తెలిపారు. నిర్మల్‌ పట్టణాన్ని కరోనా ప్రభావిత జోన్‌గా గుర్తించి కరోనా వైరస్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు అమలు చేస్తున్నామన్నారు. వంద వైద్య బృందాలతో మూడు రోజులపాటు ఇంటింటా సర్వే నిర్వహించి 70వేల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నిర్మల్‌లో కరోనాను కంట్రోల్‌ చేయడానికి పలు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జోహ్రానగర్‌ వీధిని సీజ్‌ చేయడం జరిగిందన్నారు. మరణించిన వ్యక్తి ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి మార్చి 18న నిర్మల్‌కు తిరిగి రావడం జరిగిందన్నారు. అతను విమానయానం ద్వారా శంషాబాద్‌కు, అక్కడ నుంచి కారులో నిర్మల్‌కు చేరుకున్నాడని పేర్కొన్నారు. ఆయనతో36 మంది ప్రాథమిక పరిచయస్తులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

వారందరినీ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డ్‌కు తరలించామన్నారు. వారి రక్త నమూనాలు గాంధీ ఆస్పత్రికి పంపించడం జరుగుతుందన్నారు. మృతుడి ఇంటి నుంచి ఒక కిలోమీటర్‌ పరిధిలో ఉన్న వారు ఎవరు కూడా బయటకు రావొద్దన్నారు. అక్కడి వారితో పాటు పట్టణ వాసులు అందరికీ  జిల్లా పౌరసరఫరాల శాఖ ద్వారా ఇంటి వద్దకే రేషన్‌ బియ్యం వచ్చి ఇస్తారన్నారు. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతున్నందున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా లక్షణాలతో మరణించిన వ్యక్తితో ప్రాథమిక, సెకండరీ సంబంధాలు కలిగిన వారికి హోమ్, ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించడం జరుగుతుందన్నారు. వైరస్‌ లక్షణాలు ఉన్న చాలామంది మెడికల్‌ షాప్‌లలో సొంతంగా మందులు కొనుగోలు చేస్తున్నారని, పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే మందులు ఇవ్వాల్సిందిగా ఫార్మాసిస్ట్‌ లను ఆదేశించడం జరిగిందన్నారు. మృతుడికి 11వ రోజున వైరస్‌ లక్షణాలు తేలితే 13రోజునే మృతి చెందాడన్నారు. కరోనా ప్రభావం సీరియస్‌గా ఉందని కలెక్టర్‌ హెచ్చరించారు. ప్రజలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండవద్దని సూచించారు.


మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖి

ఇంటి వద్దకే వైద్య బృందాలు...
జిల్లాలో పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని కలెక్టర్‌ వివరించారు.
►  వైరస్‌ ప్రభావితం ఉన్న నిర్మల్‌ పట్టణంలో వంద వైద్య బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
►   ఈ బృందాలు మూడు రోజులపాటు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తాయని తెలిపారు.
►   సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉన్నందున పట్టణంలో ఎవరు కూడా టూ వీలర్స్, ఫోర్‌ వీలర్స్‌ వాహనాలతో బయటకు రావద్దన్నారు. 
►   అత్యవసరం లేకున్నా బయటకు వస్తే వాహనాలను సీజ్‌ చేయడం జరుగుతుందన్నారు. 
►   జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో ఉన్న కూరగాయల మార్కెట్‌ను మూసి     వేశామన్నారు. 
►   పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో 8 చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 
►   ప్రతి కాలనీలో ఇంటిలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం జరుగుతుందన్నారు.

కోర్టుకు సరెండర్‌ చేస్తాం...
అమలులో ఉన్న సంపూర్ణ లాక్‌డౌన్‌ ధిక్కరించి, రోడ్డు మీద వచ్చే వాహనాలను సీజ్‌ చేసి, కోర్టుకు సరెండర్‌ చేస్తామని ఎస్పీ శశిధర్‌ రాజు హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు, సమాచారం షేర్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 98 కేసులు బుక్‌ చేయడం జరిగిందని, 180 వాహనాలు సీజ్‌ చేయడం జరిగిందన్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ వసంత్‌రావు, జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్, కలెక్టరేట్‌ ఏవో కరీం, తదితరులు  పాల్గొన్నారు.

జిల్లా వివరాలు..
కరోనా పాజిటివ్‌ కేసులు : 01 (గాంధీ ఆస్పత్రిలో మృతి)
ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు : 52
విదేశాల నుంచి వచ్చినవారు : 1,055
14 రోజుల క్వారంటైన్‌ పూర్తయిన వారు : 920
హోం క్వారంటైన్‌లో ఉన్నవారు : 125
పాలిటెక్నిక్‌ కేంద్రంలోఉన్న వారు : 43
కేజీబీవీ కేంద్రంలోఉన్న వారు : 39

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement