త్వరలో తెలంగాణలో అభివృద్ధి యాత్ర
హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్ శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య కార్యదర్శి నరసింగరావును కలిశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి హల్దీవాగుపై నిర్మించిన చెరువును నింపాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ కేసీఆర్ కేవలం పథకాలు ప్రకటించకుండా తన ఆర్థిక విధానం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ అభివృద్ధి యాత్రలతో ప్రజల్లోకి వెళ్తానని గద్దర్ తెలిపారు.
వందలాది కేసులన్నా తెలంగాణ యువత పరిస్థితి ఏమిటని గద్దర్ ప్రశ్నించారు. ప్రజల పోరాటాల వల్లే తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. ఇక అభివృద్ధి కూడా పోరాడి సాధించుకోవాలని గద్దర్ అన్నారు. మావోయిస్టు నేతల ఎజెండా అమలు చేస్తానన్న కేసీఆర్ ....టీఆర్ఎస్ మేనిఫెస్టోలో 25 శాతం అమలు చేసినా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. మావోయిస్టులపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉండాలనేది మావోయిస్టులు-ప్రభుత్వం చర్చల ద్వారా తేల్చుకోవాలన్నారు.