వడగండ్ల బాధితులకు ఇన్‌పుట్ సబ్సిడీ: పోచారం
నిజామాబాద్: వడగండ్ల వర్షాల వల్ల తెలంగాణ రాష్ర్టంలో పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ అందజేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 2014 సంవత్సరంలో పంటలు నష్టపోయిన బాధిత రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమయ్యే రూ.8 కోట్ల 4 లక్షలకు గాను ప్రస్తుతం రూ.4 కోట్లు ప్రభుత్వ ఖాతాలో సిద్ధంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా 2009 నుంచి 2013 వరకు కూడా వడగండ్ల వల్ల నష్టపోయిన రైతులకు రూ.74 కోట్ల నిధులను కూడా వీలైనంత త్వరలో అందజేస్తామన్నారు.
పోలవరంపై వెనక్కి తగ్గం: పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి పోచారం అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్క సెంటిమీటరు భూమి లేదా ప్రాంతం కాని ఏపీలో కలిపితే ఊరుకోబోమన్నారు. ఏడు మండలాలను సాధించుకోవడానికి తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.