సాక్షి, సంగారెడ్డి: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా హరితహారం కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహా ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వాటిని అధిగమించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు 9 గంటలు విద్యుత్ వచ్చేదని ఇప్పుడు 24 గంటలు విద్యుత్ అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. 2016 నుంచి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అని అన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో తమకు ప్రాతినిథ్యం కలగలేదని సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేశారని ఎర్రబెల్లి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతిరాజ్ చట్టంలోమార్పులు చేసి ఉద్యోగుల సరిగ్గా పని చేస్తున్నారా లేదా చూసే బాధ్యతను సర్పంచ్ లకు అప్పగించిందని అన్నారు. ఒకవేళ సర్పంచ్‌లు సరిగ్గా విధులు నిర్వహించకపోతే తీసివేసే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నట్లు ఆయన అన్నారు. హరితహారంలో భాగంగా సర్పంచ్‌లు కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులే కాకుండా సొంత గ్రామాలలో దాతల సహాయం తీసుకోవాలని సర్పంచులకు సూచించారు. మొక్కలు నాటే బాధ్యతను 80 శాతం పూర్తి చేసిన గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ఎర్రబెల్లి తెలిపారు. అడవులు అంతరించిపోయి కోతులు ఊర్లకు వస్తున్న స్రస్తుత తరుణంలో హరితహారాన్ని పెంచే విధంగా ప్రజా ప్రతినిధులు, సమాజం కృషి చేయాలని ఎర్రబెల్లి సూచించారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీ, కాంగ్రెస్ పాలనలో అడవులను, పర్యావరణాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. అటవీశాఖలో నిధులు కేటాయించామని అన్ని గ్రామాల్లో మొక్కలు పెంచాలని సూచించారు. ఇక జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ 657గ్రామపంచాయతీలలో 1లక్ష 50 వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని, దాదాపు 3 లక్షలు మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని అన్నారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ అడవులు అంతరించిపోయి వర్షాలు లేని ప్రస్తుత తరుణంలో మొక్కలు నాటడం ఎంతో అవసరం అని అన్నారు. రేపటి తరాలకు ఆక్సిజన్ అందించాలంటే అందరు మొక్కలు నాటాలని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సింగూరుకు నీటిని అందిస్తామని ఇంద్రకరణ్ హామీ ఇచ్చారు. వీటితో పాటు రెండు పడకల ఇళ్ళకు మంత్రి నిధులు మంజూరు చేశారు. ఇంకా ఈ కర్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment