సుర్ధేపల్లి (నేలకొండపల్లి): జాతి పతాకకు సెల్యూట్ చేయడానికి, జాతి పిత మహాత్మాగాంధీ చిత్రపటం వద్ద కొబ్బరికాయ కొట్టడానికి ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిరాకరించాడు. దీనిని ప్రశ్నించిన గ్రామస్తులు, ప్రజాప్రతినిధులతో... ‘‘అది నా వ్యక్తిగతం’’ అంటూ వాదనకు దిగారు. అందరూ కలిసి గట్టిగా మందలించడంతో.. ‘‘నూను బడికే రాను పోండి’’ అంటూ, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
సుర్ధేపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు...
నేలకొండపల్లి మండలంలోని సుర్ధేపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలకు విద్యార్థులతోపాటు గ్రామస్తులు, సర్పంచ్, స్కూల్ మేనేజ్ కమిటీ(ఎస్‌ఎంసీ) చైర్మన్ ఉదయం ఎనిమిది గంటలకే వచ్చారు. సమయం గడుస్తున్నా జెండా ఎగురవేసేందుకు ప్రధానోపాధ్యాయుడు షరీఫ్ ముందుకు రాలేదు. ‘‘ఆలస్యమవుతోంది. (గాంధీ చిత్రపటం వద్ద) కొబ్బరికాయ కొట్టి, జెండా ఎగరేయండి’’ అని సర్పంచ్, ఎస్‌ఎంసీ చైర్మన్ కోరారు. ‘‘కొబ్బరికాయ కొట్టడం నాకిష్టం లేదు. కొట్టను.
జాతీయ జెండాకు కూడా సెల్యూట్ చేయను’’ అని ఆయన తెగేసి చెప్పాడు. గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ‘‘అది నా వ్యక్తిగతం. దానిని మార్చుకోను. అవసరమైతే ఉద్యోగానికే రాజీనామా చేస్తాను కానీ.. జెండాకు మాత్రం సెల్యూట్ చేయను’’ అంటూ మొండికేశాడు. అంతేకాదు.. తెలంగాణ గీతాన్ని ఉద్దేశించి కూడా అనుచితంగా మాట్లాడాడు. అతని తీరుతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు గట్టిగా మందలించడంతో.. ‘‘అసలు నేను బడికే రాను పోండి’’ అంటూ, మోటార్ సైకిల్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అనంతరం, అక్కడే గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఈ సమాచారమందుకున్న వెంటనే తహశీల్దార్ జి.సుదర్శన్‌రావు, ఎంఈఓ యాలమూడి రవీందర్, ఆర్‌ఐలు వసంత, వెంకటేశ్వర్లు వచ్చి గ్రామస్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. జాతీయ జెండాను అవమానించిన సదరు ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పి, అదే పాఠశాలలోని ఉపాధ్యాయురాలు ప్రమీలతో 10.20 గంటలకు పతాకావిష్కరణ చేయించారు.
అనంతరం, పాఠశాలలో గ్రామస్తులతో అధికారులు సమావేశమయ్యారు. ప్రధానోపాధ్యాయుడు షరీఫ్ గతంలో కూడా ఇదే మాదిరిగా వ్యహరించారని గ్రామస్తులు, సర్పంచ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ప్రధానోపాధ్యాయుడు గత మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాడని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకుండా తప్పించుకునేందుకుగాను గతంలోలోనూ స్వాతంత్య్ర దినోత్సవం రోజున సెలవు పెట్టినట్టు చెప్పారు. హెచ్‌ఎం తీరుపై కలెక్టర్‌కు నివేదిక పంపిస్తానని తహశీల్దార్ చెప్పటంతో గ్రామస్తులు శాంతించారు.
జాతి పతాకకు సెల్యూట్ చేయను..
Published Sat, Aug 16 2014 3:04 AM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM
Advertisement
Advertisement