నిలిచిన ప్రగతి చక్రం  | Loss of Rs 12 crores to RTC | Sakshi
Sakshi News home page

నిలిచిన ప్రగతి చక్రం 

Published Wed, Aug 8 2018 1:39 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

Loss of Rs 12 crores to RTC - Sakshi

బోసిపోయిన మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: నూతన మోటారు వాహన చట్ట సవరణ బిల్లు–2016కు వ్యతిరేకంగా భారత రోడ్డు రవాణా సంస్థల సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక్కరోజు సమ్మె ప్రశాంతంగా ముగిసింది. ఆర్టీసీ, ప్రైవేటు రవాణా సంఘాలు కూడా సమ్మెకు మద్దతు పలకడంతో మంగళవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతిరోజూ సుమారు 97 లక్షలమందిని గమ్యస్థానాలకు చేరవేసే 10,500 ఆర్టీసీ బస్సులు మంగళవారం సాయంత్రం దాకా డిపోలకే పరిమితమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే సమ్మె మొదలైంది.

సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు ప్రకటించడంతో కార్మికులెవరూ విధులకు హాజరు కాలేదు. రాష్ట్రంలోని 98 డిపోల వద్ద అన్ని కార్మిక సంఘాలు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించాయి. మోటారు వాహన చట్టం సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. తెలంగాణæ మజ్దూర్‌ యూనియన్, ఎంప్లాయీస్‌ యూనియన్, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్, ఏఐటీయూసీ, సీఐటీయూ, బీకేయూ, టీజేఎంయూ, ఐఎన్‌టీయూసీ, బీఎస్పీ సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఒక్క బీఎంఎస్‌ అనుబంధ కార్మిక సంఘ్‌ మినహా కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు. కాగా, ఆర్టీసీకి సమ్మె కారణంగా దాదాపు రూ.12 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు.  

పాక్షికంగా ఆటోలు, క్యాబ్‌లు.. 
వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా తామూ సమ్మెలో పాల్గొంటామని ఆటోలు, క్యాబ్‌ల సంఘాలు ప్రకటించినప్పటికీ, వీరు పాక్షికంగా సర్వీసులు నడిపారు. ఆర్టీసీ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయకపోవంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లో ఉదయం 4 గంటల నుంచే ఆటో సర్వీసులు మొదలయ్యాయి. సమ్మె నెపంతో ప్రయాణికుల వద్ద రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికుల వద్ద ప్రైవేటు కార్ల డ్రైవర్లు.. సూపర్‌ లగ్జరీ చార్జీల కంటే రెండింతలు వసూలు చేశారు. వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, విజయవాడ, షాద్‌నగర్‌ రూట్లలో ఈ దోపిడీ కొనసాగింది. 

ఏపీ నుంచి 30 శాతం బస్సులే.. 
ఏపీ నుంచి రావాల్సిన బస్సులపైనా సమ్మె ప్రభావం పడింది. రోజూ వచ్చే బస్సుల్లో 30 శాతం బస్సులే వచ్చాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఏపీలో గుర్తింపు సంఘం ఎన్నికల హడావుడి వల్ల అక్కడి సంఘాలు పెద్దగా సమ్మెలో పాల్గొనలేదు.  

రైల్వే ప్రత్యేక సర్వీసులు.. 
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు సర్వీసులను నడిపించింది. లింగంపల్లి –ఫలక్‌నుమా, లింగంపల్లి– సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక ఎంఎంటీఎస్‌ సర్వీసులను నడిపించారు. కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడిచాయి. 

ఇంతకీ సమ్మె దేనికి? 
నూతన మోటార్‌ వాహన చట్టం సవరణ బిల్లు–2016ను చూసి రవాణా రంగంపై ఆధారపడ్డ వారంతా బెంబేలెత్తుతున్నారు. ఈ బిల్లు వల్ల దేశంలో రవాణా వ్యవస్థ కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా ఉందని, రవాణాా రంగాన్ని నమ్ముకున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రవాణాా సంస్థల ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కొత్త చట్టం నిబంధనలివే..
- కొత్త మోటార్‌ వాహన చట్ట సవరణ బిల్లు–2016 ప్రకారం.. ప్రైవేటు వాళ్లు రూట్లను కొనేసుకోవచ్చు. అంటే నిత్యం లాభాలు వస్తూ, బిజీగా ఉండే రూట్లను ఏ ప్రైవేటు కంపెనీ కొనుక్కున్నా ఆ రూటులో ఆర్టీసీ బస్సు నడవకూడదు. ఉదాహరణకు తెలంగాణ నుంచి విజయవాడ చాలా రద్దీ రూటు. దీన్ని ఏదైనా ప్రైవేటు సంస్థ కొనుగోలు చేస్తే ఆ దారిలో ఆర్టీసీ బస్సులు నడపకూడదు. ఈ విధానం అమలైతే ఆర్టీసీ బస్సులు లాభాలున్న రూట్లలో తిరగలేవు. అప్పుల ఊబిలో ఉన్న ఆర్టీసీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. 
థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు భారీగా పెంచుతున్నారని రవాణా రంగం మీద ఆధారపడ్డవారు ఆరోపిస్తున్నారు. 
కొత్త బిల్లులో భారీగా జరిమానాలు పెంచారు. ఉదాహరణకు సరైన పర్మిట్లు లేకుండా నడిపిస్తే రూ.10,000 జరిమానా విధిస్తారు. 
​​​​​​​- లైసెన్సు నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపితే.. రూ.25 వేల నుంచి 1 లక్ష వరకు జరిమానా. 
​​​​​​​- ఓవర్‌లోడ్‌కి రూ.20,000 జరిమానా, మూడేళ్ల పాటు డ్రైవింగ్‌ లైసెన్సు రద్దు. 
​​​​​​​- అధిక ప్రయాణికులను ఎక్కిస్తే ఎంతమంది ఎక్కువగా ఉంటే అంతమందికి రూ.1000 చొప్పున వసూలు చేస్తారు. 

సాయంత్రానికి రోడ్డెక్కిన బస్సులు 
24 గంటల సమ్మె అయినా సాయంత్రం 6 గంటలు దాటాక హైదరాబాద్‌లో సగం బస్సులు రోడ్డెక్కాయి. జిల్లాల్లోని డిపోల్లో కొన్ని బస్సులు రోడ్డెక్కాయి. అర్ధరాత్రి నుంచి పూర్తిస్థాయిలో బస్సు సర్వీసులు ప్రారంభం అవుతాయి. కాగా, ఆర్టీసీ సమ్మెలో పాల్గొని విజయవంతం చేసిన కార్మికులకు వివిధ యూనియన్ల నాయకులు అశ్వత్థామరెడ్డి (టీఎంయూ), నాగేశ్వర్‌రావు, అశోక్‌ (ఎన్‌ఎంయూ) రాజిరెడ్డి (ఈయూ), హన్మంత్‌ (టీజేఎంయూ) కృతజ్ఞతలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement