కేటీఆర్‌కు మంచు లక్ష్మీ లేఖ..
హైదరాబాద్: నటి మంచు లక్ష్మి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు లేఖ రాశారు. నగరానికి వినాయక చవితి సందర్భంగా జరుగుతున్న నష్టం గురించి ఆమె తెలిపారు. మండపాలను నిర్మించడానికి రోడ్లను తవ్వుతున్నారని, ఫిల్మ్ నగర్ రోడ్డు నంబరు 1లో తాను ఆ దృశ్యాన్ని చూశానన్నారు. అంతేకాక ఎత్తైన వినాయక విగ్రహాలను తరలించేందుకు అడ్డంగా ఉన్న కేబుల్ వైర్లను కూడా కట్ చేశారని చెప్పారు. వీటన్నింటిని తిరిగి బాగు చేసే బాధ్యతా ఎవరు తీసుకుంటారో ఓ సిటిజన్ గా తెలుసుకోవాలని ఉందని ఆమె అన్నారు.
ప్రస్తుతం వినాయక చవితి మతపరంగా కాకుండా ఓ పోటీగా భావిస్తున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ పండుగను ఇతరుల కన్నా వైభవంగా జరపాలని కష్టపడుతున్నారు. ఆ విధంగా కాకుండా ప్రాంతానికి ఒకే మండపం ఉండేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు. అలా చేయడం వల్ల వ్యక్తులో ఐక్యమత్యం పెరుగుందన్నారు. అంతేకాక అందరూ కలిసి పండుగను జరుపుకుని, కలిసి మెలసి ఉండాలనే ఆలోచన వస్తుందని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ ద్వారా తెలుపుతున్నానని కేటీఆర్‌కు చెప్పారు. ఆయన వెంటనే ఈ విషయంపై చర్యలు తీసుకుంటారని తెలుసని ఆమె అన్నారు. రానున్న రోజులో గణపతి విగ్రహాల ఎత్తుపై పరిమితులు పెట్టాలని మంచు లక్ష్మీ కేటీఆర్‌ను కోరారు. మట్టి గణపతి విగ్రహాలకు ఆదరణ పెరగడం సంతోషంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఫిల్మ్‌నగర్‌లో గణపతి వేడుక కోసం రోడ్డును తవ్వి, కట్టెలు కడుతున్న ఫొటోను ఆమె పోస్ట్ చేశారు.