ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తెలంగాణలో ఆ ఖ్యాతికి తగ్గట్టుగా ప్రధాన పరిపాలన భవనాలు ఉండాలన్న దిశలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా హుస్సేన్‌సాగర్ తీరంలో సచివాలయం కోసం భారీ భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సచివాలయం ఉన్న 24 ఎకరాల స్థలంలోనే తెలంగాణ సంస్కృతికి దర్పణం పడుతూ ఆధునిక హంగులతో కొత్త సెక్రటేరియట్ నిర్మించబోతోంది. అలాగే రాష్ట్రానికి కీలకమైన శాసనసభ, శాసన మండలిలకు కూడా అదే స్థాయిలో సమీకృత భవన సముదాయాన్ని నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌ను ఆనుకుని శాసనసభ, శాసన మండలి భవనాలున్నాయి. నిజాం కాలంలో నిర్మితమైన అసెంబ్లీ భవన సముదాయం చూడటానికి ఘనంగా కనిపించినా, అవి పురాతనమైపోవటంతో అంత వసతిగా లేవని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు.
ఇందులో పాత అసెంబ్లీ భవనం సరిగా లేకపోవటంతో దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు హయాంలో ఓ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇందులోనే తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతోంది. శాసన మండలికి ప్రత్యేక భవనం లేకపోవటంతో జూబ్లీహాల్‌ను మండలి భవనంగా మార్చారు. ఈ నేపథ్యంలో సరైన వసతులు లేని భవనాల్లో చట్టసభలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. సచివాలయానికి ఘనంగా భవనాన్ని నిర్మించబోతున్నందున, చట్టసభలకు కూడా అదే స్థాయిలో భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు అనువైన స్థలాలు గుర్తించి నివేదిక ఇవ్వాల్సిందిగా రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ప్రస్తుతానికి మూడు ప్రాంతాలకు సంబంధించి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వీటిలో ఓ స్థలాన్ని చట్టసభల భవనాల కోసం ఖరారు చేయనున్నట్టు సమాచారం.
పబ్లిక్ గార్డెన్
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించిన పబ్లిక్ గార్డెన్‌ను ఓ స్థలంగా గుర్తించారు. దాదాపు 35 ఎకరాల్లో విస్తరించిన పబ్లిక్ గార్డెన్ నిజాం కాలంలో హైదరాబాద్ కీ షాన్‌గా రూపుదిద్దుకున్న ఉద్యానవనం. ఇందులో జూబ్లీహాల్‌తోపాటు డాక్టర్ వైఎస్‌రాజశేఖరరెడ్డి తెలంగాణ స్టేట్ మ్యూజియం, జవహర్ బాలభవన్, హెల్త్ మ్యూజియం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు లలిత కళాతోరణం, ఉద్యానవన విభాగ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. గతంలో అద్భుతంగా ఉండి నగరవాసులకు ప్రధాన విహార విడిదిగా ఉన్న ఉద్యానవనాలు ప్రస్తుతం నిర్వహణ సరిగా లేక మురికికూపాలుగా మారాయి. దీంతో జనం కూడా పెద్దగా రావడంలేదు.
దీంతో పోకిరీలు, ఆకతాయిలకు ఇది అడ్డాగా మారిపోయింది. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించి నగరవాసులను ఆకట్టుకున్న లలిత కళాతోరణం కూడా కళ తప్పింది. ఇందులోని ఓపెన్ థియేటర్ ఎంతో అలరించేది. ఇప్పుడు అందులో సినిమా ప్రదర్శనలు లేక వెలవెలబోతోంది. ఈ మొత్తం గార్డెన్‌ను పునరుద్ధరించి మెరుగుపరచాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. దీనిని ఆనుకునే ప్రస్తుత అసెంబ్లీ భవన సముదాయం ఉంది. ఈ ఉద్యానవనంలో కొత్త అసెంబ్లీ భవనాలు నిర్మిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఇందులో ఉన్న ఖాళీ స్థలం ఎంత, భవనాల విస్తీర్ణం ఎంత అనే వివరాలు అధికారులు సేకరిస్తున్నారు.
ఛాతీ వ్యాధుల ఆసుపత్రి ప్రాంగణం
ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ వ్యాధుల ఆసుపత్రి ప్రాంగణాన్ని కూడా పరిశీలనలో ఉంది. దాదాపు 60 ఎకరాల్లో విస్తరించిన ఆ స్థలంలో కొంత భాగాన్ని చట్టసభల భవనాల కోసం వినియోగించుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో ఇక్కడే సచివాలయాన్ని నిర్మించాలని భావించింది. కానీ వాస్తు ప్రకారం అది సరిగా ఉండదన్న అభిప్రాయంతోపాటు తీవ్ర ట్రాఫిక్ చిక్కులుండే ఏరియా కావటంతో ఆ ఆలోచనను విరమించుకుంది. ఇక్కడి ఆసుపత్రిని మరో ప్రాంతానికి తరలించి అక్కడ అసెంబ్లీ భవన సముదాయం నిర్మిస్తే బాగుంటుందా అన్న కోణంలో ప్రస్తుతం ఆలోచిస్తోంది. దీంతో ఇక్కడి ఆసుపత్రి తరలింపు, అందులో ఉన్న స్థలం తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
ఇర్రమ్ మంజిల్
ప్రస్తుతం నీటి పారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ ప్రధాన భవనాలున్న ఇర్రమ్ మంజిల్ (ఎర్రమంజిల్) ప్రాంగణాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో నిజాంకాలం నాటి పురాతన ఇర్రమ్ మంజిల్ ప్యాలెస్ ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ప్రధాన భవనంగా ఇది కొనసాగింది. రెండేళ్ల క్రితమే ప్రభుత్వం దీని వెనక కొత్త భవనాన్ని నిర్మించటంతో ఆ శాఖ కార్యాలయాన్ని అందులోకి తరలించారు. అప్పటి నుంచి ఈ పురాతన ప్యాలెస్ ఖాళీగా ఉంది. దాన్ని కూల్చి ఆ స్థలంలో అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుందో అని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే అది హెరిటేజ్ భవనం కావటంతో దాన్ని కూల్చాలంటే ముందుగా హెరిటేజ్ జాబితాలోంచి ఆ పేరును చట్టబద్ధ ప్రక్రియ ద్వారా తొలగించాల్సి ఉంది.
దీనికి తోడు ఆ ప్రాంతం గుట్ట భాగం కావటంతో కొంత ఎత్తుగా, కొంత పల్లంగా ఉంటుంది. ఇది కూడా అంత యోగ్యం కాదన్న అభిప్రాయం ఉంది. అయినా అధికారులు దాని వివరాలు సేకరించి ముఖ్యమంత్రికి అందించనున్నారు. ఈ మూడు స్థలాలతోపాటు నగరం వెలుపల అసెంబ్లీ నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. చట్ట సభలు నిరంతరం కొనసాగవు. సంవత్సరం మొత్తంలో 50 రోజులకు మించి కార్యకలాపాలు ఉండవు. మిగతా సమయం ఖాళీగానే ఉంటుంది. అందువల్ల నగర శివారులో నిర్మించినా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చన్న అభిప్రాయం ఉంది. దీనికి వీలుగా కూడా కొన్ని ప్రాంతాలను అధికారులు ఎంపిక చేస్తున్నారు.
ప్రస్తుత అసెంబ్లీ భవనం అలాగే...
ప్రస్తుతం చట్టసభలు కొనసాగుతున్న అసెంబ్లీ భవనం హెరిటేజ్ జాబితాలో ఉంది. నిజాం హయాంలో నిర్మితమైనవాటిలో ఇదీ ప్రధానమైందే. ఈ నేపథ్యంలో దాన్ని తొలగించటం సాధ్యం కాదు. అందుకు జనం కూడా ఆమోదించే అవకాశం లేదు. దీంతో ఆ భవనాన్ని అలాగే ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ భవనాలను హైదరాబాద్ మ్యూజియంగా మార్చాలన్న ప్రతిపాదన కూడా ఉంది. స్టేట్ మ్యూజియం భవనం ఇరుకుగా ఉంది. దీంతో చాలా పురాతన వస్తువులను గదుల్లో పెట్టి తాళం వేశారు. అసెంబ్లీ భవనాన్ని మ్యూజియంకు అప్పగిస్తే వాటన్నింటిని ప్రదర్శనలో ఉంచే వీలుంటుంది. అందుకే దీన్ని మ్యూజియంగా మార్చాలన్న ప్రతిపాదన ఉంది. అసెంబ్లీకి కొత్త భవనం నిర్మిస్తే ప్రస్తుత భవనం మ్యూజియంగా మారే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment