అప్రూవర్‌గా అథవుల్లా రెహ్మాన్?
* ‘ఉగ్ర’ కేసులో యోచిస్తున్న ఎన్‌ఐఏ అధికారులు
* ఈ నేపథ్యంలోనే నిందితుడు ఢిల్లీకి తరలింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించే కుట్రతో ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన ‘జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్’ (జేకేబీహెచ్) ఉగ్రవాది మహ్మద్ అథవుల్లా రెహ్మాన్‌ను అప్రూవర్‌గా మార్చాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 12న అరెస్టు చేసిన ఇతడిని మంగళవారం రెండో దఫా కస్టడీకి తీసుకున్న అధికారులు ఢిల్లీ తరలించడం వెనుక ఇదే కారణమని సమాచారం. అప్రూవర్లు అందించిన సమాచారం కేసు దర్యాప్తులో కీలకంగా మారడంతో పాటు సాక్ష్యాధారాల సేకరణకూ ఎంతో ఉపయుక్తంగా మారుతుంది.
సాధారణంగా మాడ్యూల్‌లో పని చేసినప్పటికీ నేరంతో ప్రమేయం లేని వారినే అధికారులు అప్రూవర్‌గా మారుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే జేకేబీహెచ్ మాడ్యూల్‌కు సంబంధించి అథవుల్లాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
విధ్వంసం తర్వాత కెరైల్లికి...
నగరంలో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నిన జేకేబీహెచ్ ఉగ్రవాదులు ‘ఆపరేషన్’ తర్వాత హైదరాబాద్‌లో ఉండకూడదని పథక రచన చేశారు. ఇందులో భాగంగా ఈ మాడ్యూల్‌కు అప్రకటిత చీఫ్‌గా వ్యవహరించిన మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ రంగారెడ్డి జిల్లా థరూర్ మండలంలోని అనంతారం, కెరైల్లి గ్రామాలను సందర్శించాడని ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగు చూసింది. కెరైల్లిలో రెండు రోజులు మకాం వేశాడు. తానో వ్యాపారినంటూ అక్కడి వారిని పరిచయం చేసుకున్న యజ్దానీ... ఫామ్‌హౌస్ నిర్మాణానికి స్థలం ఖరీదు చేయడానికి వచ్చానంటూ నమ్మబలికాడు.
సోమవారం యజ్దానీని తీసుకుని అక్కడకు వెళ్లిన ఎన్‌ఐఏ అధికారులు పలు ఆధారాలు సేకరించారు. బుధవారం యజ్దానీ తలదాచుకున్న ప్రాంత నిర్వాహకులను హైదరాబాద్ పిలిపించి వారి నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. రెండు రోజులు తమ వద్ద ఉన్నప్పటికీ యజ్దానీ అసలు విషయం చెప్పలేదని, అతడి ప్రవర్తన సైతం తమకు ఎలాంటి అనుమానాలూ కలిగించలేదని వారు ఎన్‌ఐఏ అధికారులకు తెలిపారు.
నాసిర్‌కు నగరం నుంచే పేలుడు పదార్థాలు?
ఈ విచారణ కొనసాగుతుండగా... ఔరంగాబాద్ యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు పర్భనీలో పట్టుకున్న మరో ఐసిస్ ఉగ్రవాది నాసిర్ అలియాస్ ఖదీర్ అబు బకర్ యాఫై చావుస్ వెల్లడించిన అంశాలు కేంద్ర నిఘా వర్గాలను కలవరపెడుతున్నాయి. పర్భనీ జిల్లాకు చెందిన 31 ఏళ్ల ఈ ఇంజనీర్ సైతం సిరియా కేంద్రంగా పని చేస్తున్న ఫషీ ఆర్మర్ ఆదేశాల మేరకు ‘ఉగ్ర’ చర్యలకు సన్నద్ధమయ్యాడు. ఈ నెల 17న ఇతడిని అరెస్టు చేసిన ఏటీఎస్ అధికారులు వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించారు.
ఈ నేపథ్యంలోనే ఆర్మర్ ఆదేశాల మేరకు కొన్ని బాంబుల్ని తయారు చేసిన నాసిర్... వాటి ఫొటోలు తీసి సోషల్‌మీడియా ద్వారా అతడికి పంపినట్లు తేలింది. ఈ బాంబుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను మహారాష్ట్రలోని నాగ్‌పూర్, పుణేలతో పాటు హైదరాబాద్ నుంచి తనకు అందాయని నాసిర్ ఏటీఎస్ విచారణలో వెల్లడించాడు. దీంతో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.