సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో సాయం చేయాలన్న ఉద్దేశంతోనే పోలీసులు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించారని ఆయన సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. చివరకు పోలీసుల సహకారంతో అధికార పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించారన్నారు. పోలీసుల చర్యను తీవ్రంగా పరిగణించాలని, భవిష్యత్‌లో ఏ అధికారి కూడా ఇలా చేయకుండా కఠినంగా శిక్షించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ శిక్ష మిగిలిన పోలీసులకు ఓ పాఠం కావాలన్నారు. ప్రచారం ముగింపు ముందు రోజు రేవంత్‌ను పోలీసులు నిర్భంధించారని, దీని ఫలితంగా అతను ఎన్నికల్లో ఓడిపోయారని తెలిపారు. రేవంత్ నిర్భంధం వ్యవహారంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరించారని హైకోర్టుకు నివేదించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసులు అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి రేవంత్‌ని అక్రమంగా నిర్భంధించి, గుర్తు తెలియని ప్రాంతానికి తరలించిన నేపథ్యంలో నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం, రేవంత్ నిర్భంధం విషయంలో పోలీసుల తీరును తప్పుపట్టింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అప్పటి వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఆమె కౌంటర్ దాఖలు చేయగా, దీనికి తిరుగు సమాధానం ఇవ్వాలని నరేందర్‌రెడ్డికి ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు ఆయన సమాధానం ఇచ్చారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని రేవంత్‌ది అక్రమ నిర్భంధంగా ప్రకటించాలని కోర్టును కోరారు. ఈ వ్యవహారంపై హైకోర్టు జనవరి 22న విచారణ జరపనుంది.
Comments
Please login to add a commentAdd a comment