
సాక్షి, సిద్ధిపేట : కొండపోచమ్మ, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పట్ల ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. ప్రాజెక్టులకు తమ పార్టీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వానిదేనన్నారు. కోర్టు తీర్పును ఒక చిల్లర పంచాయితీగా అభివర్ణించిన సీఎం కేసీఆర్.. నిందలన్నీ కాంగ్రెస్ పార్టీపై మోపుతున్నారని మండిపడ్డారు. అదే విధంగా నర్సారెడ్డి పట్ల పోలీసుల తీరును ఎండగట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి, రైతుల భూములు సస్య శ్యామలం కావాలని.. వీటితో పాటు భూనిర్వాసితులకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మానసిక ఆనందం పొందుతున్నాడే తప్ప..
‘ఇప్పటివరకు వరకు మేనిఫెస్టో గురించి గానీ, రైతుల సమస్యల గురించి గానీ పట్టించుకోకుండా.. ఎంతసేపు ఫెడరల్ ప్రంట్ పేరుతో తీర్థయాత్రలు తిరగుతూ మానసిక ఆనందం పొందుతున్నాడే తప్ప.. సీఎం కేసీఆర్ ఏ ఒక్క సమస్య గురించి మాట్లాడకపోవడం దారుణం. ప్రాజెక్ట్ పనులలో జాప్యం చేస్తూ ఆ నిందలు కాంగ్రెస్ పార్టీపై రుద్దుతున్నాడు. హైకోర్టు స్టేతో ఆగిపోయిన పనులను.. నిర్వాసితులను భయబ్రాంతులకు గురిచేసి ప్రభుత్వం పూర్తి చేస్తోంది. కోర్టు ప్రత్యేక నివేదిక తెప్పించుకుని నిర్వాసితులకు న్యాయం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యా యత్నం చేయడం దారుణం అని పొన్నం ప్రభాకర్ కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment