సర్వేతో అక్రమార్కులకు చెక్ పడే అవకాశం | Possible to check the survey Irregulars | Sakshi
Sakshi News home page

సర్వేతో అక్రమార్కులకు చెక్ పడే అవకాశం

Published Mon, Aug 18 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

Possible to check the survey Irregulars

మంచిర్యాల రూరల్ : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర సర్వేతో మంచిర్యాల మండలం గుడిపేట వద్ద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాల నిర్వాసితుల్లో అనర్హులు, బినామీల బండారం బయటపడే అవకాశం కన్పిస్తోంది. సర్వే సిబ్బంది పక్కాగా వ్యవహరిస్తే ముంపు గ్రామాల్లో నివాసం ఉంటున్న వారు ఎంత మంది? బినామీ పేర్లతో పరిహారం పొందిన వారు ఎవరు? అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి, అధికారులు చేతివాటం చూపించడంతో, ముంపునకు గురయ్యే తొమ్మిది గ్రామాల్లో 300లకు పైగా అనర్హులు తెరపైకి వచ్చినట్లు సమాచారం.

వీరిని గుర్తించేందుకు అధికారులు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా.. స్థానికంగా ఉన్న ఇబ్బందులతో అనర్హత వేటు పడలేదు. గతేడాది డిసెంబర్ వరకు పరిహారం పంపిణీ సమయంలో బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రలు, ఐరిష్ సేకరణను చేపట్టగా 129 మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమగ్రంగా సర్వే చేస్తే 300లకు పైగా అనర్హులను గుర్తించొచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చూసినా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. అనంతరం ఎన్నికల హడావుడి, రాష్ట్రపతి పాలన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బినామీల గుర్తింపు, వారిపై చర్యలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం అనర్హుల గుర్తింపునకు ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వే ఉపయోగపడనుందని అధికారులు భావిస్తున్నారు.

 అర్హులకు నిరాశ
 2006లో ముంపు గ్రామాల్లో సోషల్ ఎకనామికల్ సర్వే(ఎస్‌ఈఎస్) చేపట్టారు. గ్రామాల్లో ఉన్న వారి పేర్లు, వివరాలు సర్వే ద్వారా నమోదు చేసి నిర్వాసితులను గుర్తించారు. నిరక్షరాస్యత, అవగాహన లోపంతో కొందరు అర్హుల పేర్లు ఎస్‌ఈఎస్‌లో నమోదు చేయించుకోలేదు. ఆలస్యంగా మేల్కొన్న అర్హులైన వారు ఎస్‌ఈఎస్‌లో పేర్లు మిస్సయ్యాయని, తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామంలో దళారులు పుట్టుకొచ్చారు.

అర్హుల పేర్లు ఎస్‌ఈఎస్‌లో నమోదు కాలేదంటూ, వారి పేర్లు అడ్డుపెట్టుకుని, ఒక్కో గ్రామం నుంచి 50కి పైగా బినామీ పేర్లు తెరపైకి తెచ్చారు. పేర్లు మిస్సయిన అర్హులు గ్రామానికి 10 నుండి 30 మంది వరకు ఉండగా, వారిని ఇంత వరకు అర్హులుగా అధికారులు గుర్తించలేదు. అధికారులకు ముడుపులు అందించిన వారి పేర్లు మాత్రమే ఎస్‌ఈఎస్‌లో నమోదు చేసి, ముడుపులు ఇవ్వని వారి పేర్లు నమోదు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి.

బినామీలకు కూలీ డబ్బులు, ఇంటి డబ్బులు, పునరావాస కాలనీలో ప్లాట్లు లభించాయి. దీంతో తమకు పరిహారం అందించకుండా, అనర్హులకు పరిహారం అందించారంటూ బాధితులు అప్పటి ఆర్‌ఆర్ కమిషనర్ చిరంజీవి చౌదరికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు పూర్తికాగా, సర్వేతో మేలు జరుగుతుందని నిర్వాసితులైన అర్హులు భావిస్తున్నారు.

 బినామీల్లో ఆందోళన
 బయోమెట్రిక్ విధానంతో ముంపు గ్రామాల్లోని 129 మంది బినామీలు ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. సమగ్ర సర్వే ద్వారా ఇళ్లు, కుటుంబ సభ్యుల వివరాలు, సంక్షేమ పథకాల వివరాలు, వారికి ఉన్న ఆస్తుల వివరాలు రికార్డు కానున్నాయి. దీంతో మిగిలిన బినామీలను గుర్తించేందుకు కుటుంబ సమగ్ర సర్వేఉపయోగపడనుండడంతో బినామీల్లో గుబులు మొదలైంది. ప్రతి గ్రామంలో బినామీలు అధికంగా ఉండడం, వారిపై చర్యలు తీసుకోవాలంటే రాజకీయ నాయకులు ఒత్తిడి ఉండేది. కానీ ఇప్పుడు సమగ్ర సర్వే చేపట్టడం వల్ల ఇతర ప్రాంతాల్లో ఉండే కుటుంబాలు మరోసారి గ్రామానికి వచ్చి సర్వేలో పాల్గొనే అవకాశం లేదు. ఒకవేళ సర్వేలో పాల్గొన్న గ్రామంలోని ఇతరులు గుర్తించే అవకాశం ఉంది.

 ప్రస్తుతం వారు ఉంటున్న ఊర్లలో సర్వేలో పాల్గొనాలో, ముంపు గ్రామాల్లో పరిహారం పొందడంతో ఇక్కడికి రావాలోననే ఆందోళన బినామీల్లో నెలకొంది. మరికొందరు రెండు గ్రామాల్లో పరిహారం పొందారు. వారిని కూడా సర్వే ద్వారా గుర్తించే వీలుంది. ప్రస్తుతం ముంపు గ్రామాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వేతో అనర్హులను గుర్తించడం, అర్హులకు న్యాయం జరుగుతుందని ముంపు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement