- ‘మద్దతు’కు బోనస్ కలిపి పత్తి కొనుగోలు చేయాలి
- వరంగల్ మార్కెట్‌ను సందర్శించిన కాంగ్రెస్ బృందం
వరంగల్ సిటీ : ముందుచూపు లేకపోవడం తో ప్రభుత్వం రైతన్నను నిండా ముంచుతోందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా కాంగ్రెస్ బృందం కోదండరెడ్డి ఆధ్వర్యంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్నృఇబ్బందులు, మద్దతు ధర లభించక పడుతున్న అవస్థలు, దళారుల చేతుల్లో మోసపోతున్న తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
సీసీఐ మొక్కుబడిగా కొనుగోలు చేయడం తప్ప చిత్తశుద్ధితో పత్తిని కొనుగోలు చేయడం లేదనే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పత్తి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మక్క రైతుల ఇబ్బందులను సైతం తెలుసుకొని, మార్కెట్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం, సీఎం, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రులది మాటలు తప్ప చేతలు లేవని, ఇప్పటికే పత్తి సీజన్ ప్రారంభమై రైతులు దళారుల చేతుల్లో దోపిడీకి గురవుతున్నారని అన్నారు.
మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ దీనిపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బండా ప్రకాష్, డాక్టర్ హరిరమాదేవి, మందా వినోద్‌కుమార్, దూపం సంపత్, బొంపెల్లి దేవేందర్‌రావు, మీసాల ప్రకాష్, గుండేటి నరేందర్, రామ యాదగిరి, రోకుల భాస్కర్, ఓని భాస్కర్ పాల్గొన్నారు.
సీసీఐ అధికారులపై రిపోర్టు పంపించిన జేసీ
కాగా, వరంగల్ వ్యవసాయ మార్కెట్ సీసీఐ ఇన్‌చార్జి అధికారి నాయుడు వ్యాపారులకు వత్తాసు పలుకుతూ రైతుల వద్ద నుంచి సరిగా పత్తి కొనుగోలు చేయడం లేదని జేసీ ప్రభుత్వానికి రిపోర్టు పంపించినట్లు తెలిసింది.
రైతులను ఆదుకోవాలి : కాంగ్రెస్
హన్మకొండ అర్బన్ : రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ నేతల బృందం కలెక్టర్ జి.కిషన్‌ను కోరింది. ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 76 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. అలాగే ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వెంకటనారాయణను కూడా కలిసి వినతిపత్రం అందజేశారు.