'Kasarla Shyam' Interview: Ramulo Ramula Song Lyricist Special Interview With Sakshi - Sakshi
Sakshi News home page

నాటకాల నుంచి రచయితగా..

Published Thu, Nov 28 2019 9:28 AM | Last Updated on Thu, Nov 28 2019 12:50 PM

Ramula Ramula Song Writer Kasarla Shyam Interview In Sakshi

సాక్షి, వరంగల్‌ :‘నాటక రంగం నుంచి రచనా రంగంలోకి వచ్చాను.. మా నాన్న స్టేజీ ఆర్టిస్ట్‌.. నా చదువు ఎక్కువగా వరంగల్‌లోనే సాగింది.. చిన్నప్పటి నుంచి నాటకాలు, రచనలు అంటే చాలా ఇష్టం.. అదే మక్కువతో రచయితగా మారాను. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నేను రాసిన రాములో... రాముల పాటకు ప్రశంసలు దక్కాయి...’ అంటున్నారు సినీ గేయ రచయిత కాసర్ల శ్యాం! వరంగల్‌కు బుధవారం వచ్చిన ఆయనను ‘సాక్షి’ పలకరించగా తన సినీ ప్రస్థానాన్ని వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే....

మాది హన్మకొండ
నేను పుట్టి పెరిగింది అంతా వరంగల్‌లోనే. హన్మకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన మా నాన్న గారు మధుసూదన్‌రావు రంగస్థల నటులు. అప్పట్లో మా నాన్న కూడా పలు చిత్రాల్లో నటించారు. దీంతో ఆయనను హన్మకొండ శోభన్‌బాబు అని పిలిచేవారు. దీంతో చిన్నతనం నుంచే నాకు కూడా సాహిత్యం ఇష్టం ఏర్పడింది. క్షీర సాగరమధురం, నటరాజు నవ్వాలి వంటి నాటకాల్లో చిన్నప్పుడే పాత్రలు పోషించాను. జానపదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన వరంగల్‌ శంకర్, సారంగపాణి తమ బృందాల్లో నాకు అవకాశం ఇచ్చారు. తొలుత నాటకరంగంలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మొదలైన నా ప్రయాణం, జానపద గేయ రచయితగా, గాయకుడిగా అనేక మలుపులు తిరిగింది. నేను రాసిన, పాడిన పాటల్లో చాలా వరకు ఆడియో క్యాసెట్ల రూపంలో వచ్చాయి.

చదివింది ఇక్కడే..
హన్మకొండలోని మచిలీబజార్‌లోని ప్రగతి స్కూల్‌లో 10వ తరగతి వరకు, ఇంటర్‌ హన్మకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, డిగ్రీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్, యూనివర్సిటీలో చదువుకున్నాను. చదువుకునే రోజుల్లో జ్యోతి కల్చరల్‌ ఆర్ట్స్‌ను ప్రారంభించి 13 నృత్య నాటికలు రాయడంతో పాటు సమాచార శాఖ ఆధ్వర్యాన ప్రదర్శనలు ఇచ్చాను. వరంగల్‌ శంకరన్న, సారంగపాణి, మా ఇంట్లో వారి ప్రోత్సాహంతో హైదారాబాద్‌ వెళ్లాను. అక్కడ తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఫోక్‌ ఆర్ట్స్‌లో చేరాక ఆకాశవాణిలో యువవాణి కార్యక్రమాన్ని నిర్వహించా. 

రాములో .. రాములా సౌత్‌  ఇండియా రికార్డ్‌
త్రివిక్రమ్‌ దర్శకత్వంతో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ‘అల వైకుంఠపురములో..’ సినిమాలో రాములో... రాములా పాట రాశాను. సౌత్‌ ఇండియాలోనే 24గంటల్లో 8.3 మిలియన్‌ మంది వీక్షకులు ఈ పాటను యూ ట్యూబ్‌లో వీక్షించారు. 20 రోజుల్లో 50 మిలియన్‌ మంది వీక్షించారు. ప్రముఖ హీరో వెంకటేష్, నాగచైతన్య నటిస్తున్న వెంకీ మామ, సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న ప్రతి రోజు పండగే, నితిన్‌ నటిస్తున్న భీష్మ ఇలా పలు సినిమాల్లోనూ పాటలు రాశాను. ఇక బస్‌ స్టాప్‌ సినిమాలోని కలలు.. పాటకు 2012లో సంతోషం అవార్డు, వంశీ ఇంటర్నేషనల్‌ వారు సినారే అవార్డు, తెలుగు రచయితల అసోసియేషన్‌ నుంచి విశిష్ట రచన పురస్కారం, సింగిడి అవార్డులు దక్కాయి.

‘కోకోకో కొక్కోరొక్కో’ పాట నేనే రాశా
2003 సంవత్సరంలో దర్శకురాలు బి.జయ తన చంటిగాడు సినిమాలో అవకాశవిుచ్చారు. ఆ సినిమాలో ‘కోకోకో కొక్కోరొక్కో’ పాట నేనే రాశా. ఆ తర్వాత ఏడేళ్లలో ఏడు చిత్రాలకు మాత్రమే పని చేశా. ఓ పక్క ఎంఫిల్‌... మరోపక్క పాటలు... కష్టమైంది. కృష్ణవంశీ మహాత్మాలో నీలపురి గాజులు... పాటతో బ్రేక్‌ వచ్చినా అవకాశాలు మాత్రం రాలేదు. ఇక మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో సినిమాలోని రింగ్‌ ట్రింగ్‌ పాటతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. దేవిశ్రీప్రసాద్‌తో వర్క్‌ చేయాలనుకున్న కోరిక ఎఫ్‌2 సినిమాలోని రెచ్చిపోదాం బ్రదర్‌ పాట ద్వారా తీరింది. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో దిమాక్‌ కరాబ్‌ నే పాట కూడా మంచి పేరు తీసుకొచి్చంది. ఇప్పటికి 150కు పైగా చిత్రాల్లో 350కు పైగా పాటలు రాశాను.

వరంగల్‌కు మంచి గుర్తింపు
వరంగల్‌కు చెందిన వారే ప్రస్తుతం ఎక్కువగా సినిమా రంగంలో రాణిస్తున్నారు. పెద్ద డైరెక్టర్లు, మంచి టెక్నీషియన్లు, సంగీత దర్శకులు, గేయ రచయితలు ఎందరో వరంగల్‌ వారే ఉన్నారు. ఇక్కడ రామప్ప, ఖిలా వరంగల్, లక్నవరం, భద్రకాళి దేవాలయం ఇలా ఎన్నో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. కాగా, సినిమా రంగంలో కొత్తగా వచ్చే వారికి అతి విశ్వాసం ఉండొద్దు. కొత్తవి నేర్చుకుంటూ ముందుకు సాగితే మంచి ఫలితం ఉంటుంది. అవకాశాలు రావడం లేదు కదా అని నిరాశకు లోనైతే ఇబ్బందులు ఎదురవుతాయి. పట్టుదలతో ముందుకు సాగితే తప్పక విజయం వరిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement