విజ్ఞాపనలు వినేవారేరీ? | Requests received from the people in government offices | Sakshi
Sakshi News home page

విజ్ఞాపనలు వినేవారేరీ?

Published Tue, Jun 24 2014 3:09 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

విజ్ఞాపనలు వినేవారేరీ? - Sakshi

విజ్ఞాపనలు వినేవారేరీ?

 సాక్షిప్రతినిధి, నల్లగొండ : గత ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి సోమవారం (23వ తేదీ) నాటికి జిల్లాలోని 177 ప్రభుత్వ కార్యాలయాల్లో  ప్రజల నుంచి స్వీకరించిన వినతులు 9442. కాగా, వీటిలో 7772 విజ్ఞాపనలను పరిష్కరించగా ఇంకా, 1670 విజ్ఞప్తులు పెండింగులోనే ఉన్నాయి. ఈ గణాంకాలను చూస్తే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల దాకా బాగా పనిచేస్తున్నారనే భ్రమ కలగవచ్చు. కానీ, జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాయాలు, కలెక్టరేట్ మాత్రమే భేష్‌గా పనిచేస్తున్నాయి.
 
 ఆర్డీఓ, ఇతర డివిజనల్, మండల కార్యాలయాల పనితీరు అధ్వానంగా ఉంది. చివరకు ఈ ఆఫీసుల్లో పనిచేసే అధికారులు, సిబ్బందిలో మెజారిటీ సోమవారం రోజైనా సకాలంలో విధులకు హాజరు కావడం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఫలితంగా ఏడాదిన్నర కాలంలో 98శాతం ప్రజలు తహసీల్దారు, ఎంపీడీఓ కార్యాలయాలకు  వెళ్లడం లేదు. వినతిపత్రాలు ఇవ్వడం లేదు. నల్లగొండ తహసీల్దార్  కార్యాలయం మినహా రెండంకెల సంఖ్యలో వినతిపత్రాలు అందుకున్న మండల కార్యాలయాలు పట్టుమని పది కూడా లేవు. అత్యధిక ఆఫీసుల్లో ఒకటీ, రెండు చొప్పున మాత్రమే వినతులు అందాయి.
 
 కాగా, జిల్లాకేంద్రంలోని ఆయా ఆఫీసుల్లో మాత్రం ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. మండల అధికారులపై నమ్మకం కోల్పోయిన ప్రజలు చిన్న పనికోసం కూడా ఎక్కడో మారుమూల గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి వ్యయ ప్రయాసాలకోర్చి వస్తున్నారు. సోమవారం జిల్లా వ్యా ప్తంగా అన్ని మండలాలు, పట్టణాల్లో ప్రజా విజ్ఞప్తుల రోజు ఏవిధంగా నడుస్తుందో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. అధికారులు సకాలంలో హాజరు కాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడిన దృశ్యం ఆవిష్కృతమైంది.జిల్లాలో అత్యధికంగా  పౌరసరఫరాల శాఖ (953), హౌసింగ్ (647), ఎస్సీ కార్పొరేషన్ (585), జిల్లా పంచాయతీ అధికారి (355), నల్లగొండ తహసీల్దార్ (343) కార్యాలయాలు అధిక సంఖ్యలో ప్రజల నుంచి ఆయా పనుల కోసం వినతిపత్రాలు అందుకున్నాయి.
 
 తమకు ప్రజల నుంచి అందిన విజ్ఞాపనలను పట్టించుకోని జిల్లా కార్యాలయాలు వరుసగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లేబర్ కమిషనర్, పులిచింతల స్పెషల్ కలెక్టర్, జిల్లా రిజిష్ట్రార్, సోషల్ ఫారెస్టు డిపార్టుమెంట్లు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. కిందిస్థాయిలో విజ్ఞప్తులను పరష్కరించడంలో కోదాడ మున్సిపాలిటీ, డిండి తహసీల్దార్, హాలియా ఎంపీడీఓ కార్యాలయాలు పూర్తిగా వెనుకబడ్డాయి. నేరెడుచర్ల  ఎంపీడీఓ, బొమ్మలరామారం తహసీల్దార్  కార్యాలయాలు నూరుశాతం ప్రజావిజ్ఞప్తులను పరిష్కరించాయి.నల్లగొండ : నల్లగొండ నియోజకవర్గంలోని తిప్పర్తి, కనగల్, నల్లగొండ మండలంలో గ్రీవెన్స్ డే అమలుకు నోచుకోవడం లేదు. సోమవారం ఎంపీడీఓ, తహసీల్దార్  కార్యాలయాల్లో అధికారులు తప్పా మిగతా శాఖలకు సంబంధించిన అధికారులు ఎవరూ హాజరుకాలేదు. తిప్పర్తి  తహసీల్దార్ కార్యాలయంలో అధికారులంతా ఉన్నారు.
 
 సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీలో  11గంటల వరకు టౌన్ ప్లానింగ్ అధికారి విధులకు హాజరుకాలేదు. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, డీఈలు 12గంటల వరకు కూడా కార్యాలయానికి రాలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా మున్సిపల్ ఆర్‌ఓ కార్యాలయ తాళం తీయలేదు. సూర్యాపేట మండలంలో ఎంఈఓ, ఎంపీడీఓ, ఏపీఓ, ఏపీఎం కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేరు. పెన్‌పహాడ్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు కూడా   ఏఓ, ఏఈఓలు ఎవరూ హాజరు కాలేదు. తహసీల్దార్ కార్యాలయంలో ఏఎస్‌ఓ కూడా కార్యాలయానికి సాయంత్రం వరకు కూడా హాజరుకాలేదు. చివ్వెంల ఎంపీడీఓ కార్యాలయంలో ఈఓఆర్డీ  కుర్చీ ఖాళీగా కనిపించింది.  కాగా ఈఓఆర్డీ బ్యాంకు పని నిమిత్తం సూర్యాపేటకు వెళ్లినట్లు ఎంపీడీఓ ఎం.సాంబశివరావు తెలి పారు. ఆత్మకూర్.ఎస్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఒక్కరే విధుల్లో ఉన్నారు..
 
 మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో మున్సిపల్ పింఛన్ల పంపిణీ అధికారి 10.50 గంటల వరకు కూడా కార్యాలయానికి రాలేదు. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ 11 గంటల వరకు కూడా కార్యాలయానికి రాలేదు. ట్రాన్స్‌కో టౌన్-2, రూరల్ కార్యాలయాల తలుపులు మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా తెరుచుకోలేదు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఉదయం 10:56 గంటలకు కూడా ఏడీ ఏ, ఏఓ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ రాలేదు. వేములపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐలు, ఏఎస్‌ఓలు ఉదయం 11గంటల వరకు కార్యాలయానికి రాలేదు. వ్యవసాయశాఖ కార్యాలయంలో 11 గంటల వరకు ఏఓ  రాలేదు.
 
 దేవరకొండ : చింతపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని 11గంటల సమయంలో సందర్శించినప్పుడు తహసీల్దార్ అందుబాటులో లేరు.  తహసీల్దార్ పుష్పలత పెట్రోల్ బంకు తనిఖీకి వెళ్లినట్లు తర్వాత ‘ సాక్షి ’కి సమాచారం అందించారు. ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్లు మినహా ఏ ఒక్క అధికారి కూడా 11 గంటల వరకు హాజరు కాలేదు. దేవరకొండలో పశువైద్యశాల ఉదయం 12గంటల సమయంలో తాళం వేసే ఉంది.  ఆర్‌డబ్ల్యూఎస్ ఆఫీసులో డీఈఈ రూము తలుపులు తెరవకుండా కనిపించగా,  దేవరకొండ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అందుబాటులో లేరు.
 
 హాలియా  : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అధికారులు ఉదయం 10.30 గంటల తరువాతే విధులకు హాజరయ్యారు. అనుముల తహసీల్దార్ ఉదయం 12.30గంటల వరకూ కార్యాలయానికి రాలేదు. మండలంలో పలు గ్రామాల్లో ఇసుక డంపులను  సీజ్ చేసేందుకు వెళ్లడంతో ఆసల్యమైనట్లు కార్యాలయ సిబ్బంది  తెలిపారు. పెద్దవూర మండలంలో మండల డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీఓలు 10.45 తర్వాతే హాజరుకాగా, మండల వైద్యాధికారిఱి 10.50కి, సీడీపీఓ 11.05 నిమిషాలకు, మండల పశువైద్యాధికారి 11.00 గంటలకు విధులకు హాజరయ్యారు. నిడమనూరు మండలంలో  ఉదయం 11గంటల వరకు తహసీల్దార్ గానీ, ఎంపీడీఓ గానీ విధులకు హాజరుకాలేదు. సీనియర్ అసిస్టెంట్ 11 గంటల తర్వాతే విధులకు  వచ్చారు.
 
 కోదాడ : నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు సిబ్బంది సకాలంలో హాజరుకాలేదు. పట్టణంలో ఉన్న కార్యాలయాలకు ఉదయం 11గంటల తరువాతే అధికారులు వచ్చారు. కోదాడ వ్యవసాయశాఖ, మండల రెవెన్యూ కార్యాలయం, గృహనిర్మాణశాఖ కార్యాలయంలో అధికారులు 10.50 గంటల తరువాతే వచ్చారు. మునగాల తహసీల్దార్, వ్యవసాయశాఖ అధికారులు 11 గంటలకు వచ్చారు. నడిగూడెం తహసీల్దార్, మండల పరిషత్, గృహనిర్మాణ శాఖ అధికారులు 10.45 గంటలకు కార్యాలయాలకు చేరుకున్నారు. మోతె మండల  కేంద్రంలో కూడా అధికారులు 11 గంటలు నుంచి 11.30 మధ్య కార్యాలయాలకు చేరుకున్నారు.
 
 నకిరేకల్ : నకిరేకల్‌లో పంచాయతీ రాజ్ డీఈ, ఐసీడీఎస్‌లో ఒక అటెండర్ మినహా మిగతా అధికారులెవరూ హాజరుకాలేదు.  వ్యవసాయ శాఖ ఏడీఏ, తహసీల్దార్ కార్యాలయాలకు కూడా అధికారులు సమయానికి హాజరుకాలేదు. రామన్నపేటలోని  ఎంపీడీఓ, తహసిల్దార్, ఐసీడీఎస్, రిజిస్ట్రేషన్, ఉపాధి, వెలుగు కార్యాలయాల్లో  ఉదయం 11గంటలలోపు ఉద్యోగుల హాజరు చాలా పలుచగా ఉంది. కట్టంగూర్, కేతేపల్లి మండలంలో వివిధ శాఖల అధికారులు సమయానికి విధులకు హాజరు కాకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.
 
 హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌లో ఐసీడీఎస్ కార్యాలయంలో ఉదయం 11 గంటల వరకు సీడీపీఓ విధులకు హాజరుకాలేదు. గరిడేపల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్,  ఈఓఆర్‌డీ, పంచాయతీ రాజ్ ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలెవరూ విధులకు హాజరుకాలేదు. గరిడేపల్లి పశువైద్యశాలకు తాళం వేసి ఉంది. హౌసింగ్ కార్యాలయంలో ఏఈ విధులకు హాజరుకాలేదు.
 ఆలేరు  : వినతులతో వచ్చిన వారికి ఆలేరులో అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. గుండాల మం డలంలో 11 గంటల దాకా ఎంపీడీఓ కార్యాల య తాళం తీయలేదు. యాదగిరిగుట్టలో  మం డలపరిషత్ అధికారులు, సిబ్బంది కార్యాలయానికి   ఉదయం 11 గంటల వరకు హాజరు కాలే దు. ఎంపీడీఓ రఘురాం సెలవులో ఉన్నట్లు తెలి పారు. ఆత్మకూర్(ఎం) మండలంలో రెవెన్యూ అధికారులు 11 గంటల వరకూరాలేదు.  
 
 భువనగిరి : భువనగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సరస్వతి మధ్యాహ్నం 12.20 కార్యాలయానికి వచ్చారు. ఈఓ, పీఆర్‌డీ వెంకటనర్సయ్య 11.20కు విధులకు వచ్చారు.  బీబీనగర్ రెవెన్యూ అధికారి ఉద యం 11 గంటలకు కార్యాలయానికి వచ్చారు. తిరుమలగిరి : తుంగతుర్తి నియోజకవర్గంలో  అధికారులెవరూ  మండల హెడ్ క్వార్టర్‌లో ఉండకపోవడంతో కార్యాలయాలకు ఆలస్యంగా వస్తున్నారు. తిరుమలగిరి తహసీల్దార్ 11.10గంటలకు విధులకు హాజరయ్యారు. ఆయా మండలాల్లో బీఆర్‌జీఎఫ్ గ్రామ సభలు నడుపుతుండడంతో అధికారులు వివిధ గ్రామాలకు వెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement