నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు వేగవంతంగా పూర్తయ్యేలా అధికారులు పనితీరును మెరుగుపర్చుకోవాలని విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమీక్ష సమావేశానికి (దిశ) మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కమిటీ చైర్మన్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు. సమావేశంలో కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను మంజూరు చేయించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుందని, వాటిని సక్రమంగా, జవాబుదారీతనంతో అమలు చేసే బాధ్యత అధికారుపైనే ఉంటుందన్నారు. అధికారులు వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టేలా ప్రగతి నివేవొకలు ఇవ్వాలని, తప్పుగా ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ వైర్లు కిందకు వేలాడి అనేకమంది చనిపోతున్నారని, వాటిని సరిచేయడంతోపాటు, అవసరమైన చోట కొత్త సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు బిగించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.
నివేదికలు లేకుండా ఎలా వస్తారు..?
కమిటీ చైర్మన్ ఎంపీ గుత్తా మాట్లాడుతూ...సమావేశాలకు నివేదికలు లేకుండా ఎలా వస్తారని, ఎజెండాలో సరైన సమాచారం పొందుపర్చలేదని విద్యుత్‌శాఖ ఎస్‌ఈపైన మండిపడ్డారు. సమావేశాలకు వచ్చేటప్పుడు సమగ్ర సమచారంతో రావాలని, ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కడెక్కడ మంజూరు చేశారనే వివరాలు తెలియకపోతే ఎట్లాగని, ఎజెండాలో కూడా వాటి వివరాలు లేవని ఎస్‌ఈ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు పథకాల అమల్లో ఇబ్బందులు తొలగించేలా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలన్నారు. మరుగుదొడ్ల కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తిచేసి ఓడీఎఫ్ జిల్లాగా మార్చేలని ఎంపీ సూచించారు. దీనదయాల్ యోజన కింద జిల్లాకు రూ.5215.19 లక్షలు మంజూరయ్యాయని, ఈ పథకం వల్ల 1757 గ్రామాలు లబ్ధిపొందుతాయని ఎంపీ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రాంతంలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు రెండేళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తికాలేదని ఈఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జరిగే ప్రదేశానికి రాకుండానే అవి పూర్తయినట్టు చెబుతున్నారని, ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారని అన్నారు. మరో ఎమ్మెల్యే రవీంద్రనాయక్ మాట్లాడుతూ...అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద 18 గ్రామాలు ముంపు గురవుతున్నాయని, 23 గ్రామాల్లో పుష్కరాల సమయంలో పైపులైన్లు ధ్వంసమయ్యాయని, వాటిని ఇప్పటివరకు పూర్తిచేయలేదని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈని ప్రశ్నించారు. డిసెంబర్‌లోగా పూర్తికావాల్సిన పనులకు, ఇంకా అంచనాలే వేయకపోవడం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment