సాధారణంగా లీటరు నీటిలో కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్) 500 మిల్లీగ్రాములు మించరాదు. కానీ పలు పారిశ్రామికవాడల్లో ఇందుకు మూడు నాలుగురెట్లు అధికంగా టీడీఎస్ నమోదైంది.
ఫార్మా, బల్క్‌డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థాలను నిర్మానుష్య ప్రదేశాల్లో, నాలాల్లో డంప్ చేస్తుంటారు. ఇవి నేరుగా భూమి పొరల్లోకి చేరి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి.
సాక్షి, హైదరాబాద్/జీడిమెట్ల/సనత్‌నగర్ : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పాతాళగంగ భయంకరమైన కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. పారిశ్రామికవాడల్లోని భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) తాజా నివేదిక నిగ్గుదేల్చింది. దశాబ్దాలుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనిక వ్యర్థాలను నాలాలు, చెరువులు, కుంటలు, బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా వదిలిపెడుతుండటం.. అవి భూమిలోకి ఇంకడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని అధ్యయనం తేల్చింది. ఈ నీళ్లు పశుపక్ష్యాదుల దాహార్తిని సైతం తీర్చలేవని, మొక్కలకు పట్టడానికి, బట్టలు ఉతకడానికి, పాత్రలు శుభ్రం చేయడానికి, స్నానానికి పనికిరావని స్పష్టం చేసింది.
చుక్క నీరూ స్వచ్ఛం లేదు..
గతేడాది వర్షాకాలానికి ముందు (మే–2019), ఆ తరువాత (జనవరి–2020) సుమారు 13 పారిశ్రామికవాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భజలాల, చెరువుల నీటి నమూనాలను ఎన్‌జీఆర్‌ఐ సేకరించి పరీక్షలు నిర్వహించింది. సాధారణంగా లీటరు నీటిలో కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్) 500 మిల్లీగ్రాములు మించరాదు. కానీ పలు పారిశ్రామికవాడల్లో ఇందుకు మూడు నాలుగురెట్లు అధికంగా టీడీఎస్ నమోదైంది. నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్‌చెరు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాలు సేకరించి.. పరీ క్షించగా వచ్చిన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలు నీటి నమూనాల్లో ఆర్సెనిక్, లెడ్ జింక్ తదితర భారలోహాల ఆనవాళ్లున్నట్టు పరీక్షల్లో తేలింది. ఎన్‌జీఆర్‌ఐ నివేదిక నేపథ్యంలో మంగళవారం ‘సాక్షి’బృందం ఆయా ప్రాంతాల్లోని భూగర్భజలాల నాణ్యత, ఆ నీటితో స్థానికులు పడుతున్న అవస్థలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
సాక్షి విజిట్..
- గతేడాది కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో బోర్లు వేయగా రసాయన జలాలతో కలుషిత నీళ్లు పడ్డాయి.
- నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో వందలాది అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతి 10 మీటర్లకు ఒక బోరు ఉంది. ప్రస్తుతం బోరు వేయాలంటే వెయ్యి నుంచి 1,600 అడుగుల లోతుకు వెళ్తేనే నీటి జాడ తెలుస్తోంది. ఒక్కో ప్లాట్‌లో రెండు మూడు బోర్లు వేస్తున్నారు.
- ఈ ప్రాంతంలో మోటారు వేయగానే ఎరుపు, పసుపు పచ్చని రంగులో నీళ్లొస్తున్నాయి. కొన్నిచోట్ల నీరు రంగు లేకున్నా.. వాసన ముక్కుపుటాలు అదరగొడుతోంది. ఈ నీటితో గిన్నెలు, వాహనాలు కడిగితే వాటిపై మరకలు, తుప్పు వస్తున్నాయి.
జీడిమెట్ల: నీళ్లు తాగాలంటే హడలే
జీడిమెట్లలో వందకుపైగా ఫార్మా, బల్క్‌డ్రగ్ రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడే వ్యర్థ రసాయన జలాలను 1983 నుంచి ఇప్పటివరకు ఖాళీ ప్రదేశాల్లో, ఓపెన్ నాలాల్లో గుట్టుచప్పుడు కాకుండా డంప్ చేస్తున్నారు. ఫలితంగా ఈ పారిశ్రామికవాడలోని భూగర్బ జలాలు విషతుల్యమయ్యాయి. బోర్లు తవ్వగా వచ్చిన నీరు దాదాపు రసాయనాలను పోలి ఉంటుంది. బోరు మోటార్ వేయగానే ఎరుపు, పసుపు పచ్చని రంగులో నీళ్లు ఎగదన్నుతాయి. దీంతో రోజూ ఇక్కడి ఒక్కో కుటుంబం.. కుటుంబసభ్యుల అవసరాలకు తగినట్టు నీటిని కొనాల్సిందే. 20 లీటర్ల డబ్బాకు రూ.30 నుంచి రూ.50 వరకు పెడుతున్నారు. దీంతో ప్రతి నెలా ఒక్కో కుటుంబం పాల బిల్లుతో సమానంగా నీటి బిల్లు చెల్లిస్తోంది. ఫార్మా, బల్క్‌డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థ రసాయనాలను అర్ధరాత్రి దాటాక నిర్మానుష్య ప్రదేశాల్లో, నాలాల్లో, పరిశ్రమ లోపల పాడుబడిన బోరు బావుల్లో డంప్ చేస్తుంటారు. ఇవి నేరుగా భూమి పొరల్లోకి చేరి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి.
జీడిమెట్లలో బోరు నుంచి వస్తున్న రసాయన జలం
30 ఏళ్లుగా విషాన్ని చూస్తున్నా..
30 ఏళ్లుగా నేనిదే ప్రాంతంలో ఉంటున్నాను. రోజురోజుకూ భూగర్భ జలాలు విషపూరితమైపోతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రసాయనాలను ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోకపోతే భావితరాలకు మంచినీరు దొరకడం కష్టమే. – శ్రీనివాస్, ఎస్‌ఆర్ నాయక్‌నగర్
సనత్‌నగర్: కలుషితంతో సతమతం
దేశంలో తొలి పారిశ్రామికవాడగా పేరొందిన సనత్‌నగర్ పారిశ్రామికవాడలో ‘భూగర్భ జలం’హాలాహలమైంది. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలను చెరువులు, కుంటలు, నాలాల్లోకి వదులుతుండటంతో వ్యర్థ రసాయన జలాలు భూగర్భంలోకి ఇంకి పాతాళగంగ కలుషితమైంది. జీడిమెట్ల, కూకట్‌పల్లి, ఫతేనగర్ పారిశ్రామికవాడల నుంచి వచ్చే విషజలాలు హుస్సేన్‌సాగర్‌కు వెళ్లే నాలాలో కలుస్తుంటాయి. ఈ నాలా సనత్‌నగర్ పారిశ్రామికవాడను ఆనుకుని ఉండడంతో భూగర్భ జలం విషపూరితమవుతోంది. ఇక్కడ భూగర్భ జలం రంగు మారి వస్తుండడంతో వాటిని వినియోగించలేని పరిస్థితి ఉంది.
ఫిల్టర్ నీళ్లు కొంటున్నాం..
బోరు నీళ్లు రంగు మారి వస్తున్నాయి. తాగేందుకు ఫిల్టర్ వాటర్ క్యాన్లను కొనుగోలు చేస్తుంటాం. దీని ద్వారా మాకు అదనపు భారమే. ఒక్క జలమండలి నీరు మాత్రమే అయితే సరిపోవడం లేదు. – శివప్రసాద్, లోథా కాసాపారడిసో అపార్ట్‌మెంట్
Comments
Please login to add a commentAdd a comment