ఆమె 27 అతడు 23.. సరిహద్దులు దాటిన ప్రేమ | Saudi Girl Came To India For Her Lover | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 2 2018 8:53 AM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Saudi Girl Came To India For Her Lover - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ఇదో 27 ఏళ్ల సౌదీ యువతి కథ... భారతీయుడైన 23 ఏళ్ల కారు డ్రైవర్‌తో ప్రేమలో పడింది.. తమ వద్ద పని చేస్తున్నా పెళ్లి చేసుకుంటానంది...అతడినే ‘వెంటాడుతూ’ అక్రమంగా భారత్‌కు వచ్చింది. వివాహం చేసుకున్న ఇరువురూ నిజామాబాద్‌లో కాపురం పెట్టారు. యువతి తండ్రి ఫిర్యాదు, ఎంబసీ జోక్యంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో (సీసీఎస్‌) గురువారం కిడ్నాప్‌ కేసు నమోదైంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి శుక్రవారం వీరిని కనిపెట్టిన ప్రత్యేక బృందం... ప్రస్తుతం నిజామాబాద్‌ ఎస్పీ వద్ద ఉన్న సదరు యువతి నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేస్తున్నారు. ఆమె తన తండ్రితో వెళతానంటే పంపిస్తామని పోలీసులు చెబుతున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన షేక్‌ అజీముద్దీన్‌ బతుకుతెరువు నిమిత్తం కొన్నేళ్ల క్రితం సౌదీకి వలసవెళ్లాడు. అక్కడ ఓ బడా వ్యాపారవేత్త వద్ద డ్రైవర్‌గా చేరాడు. కొన్నాళ్లకు తన యజమాని కుమార్తె రజా అల్‌ హర్బీకి ఇతడిపై ప్రేమ పుట్టింది. సౌదీలోని పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వివాహం చేసుకోవడం కుదరదని భావించారు. ఈ ఏడాది జనవరిలో అజీముద్దీన్‌ భారత్‌కు తిరిగి వచ్చేశాడు. ప్రస్తుతం ఇతడి కుటుంబం నిజామాబాద్‌లో నివసిస్తోంది. తిరిగి వచ్చినప్పటికీ అల్‌ హర్బీకి..అజీముద్దీన్‌కి మధ్య చాటింగ్స్, ఫోన్‌కాల్స్‌ కొనసాగాయి.  అతడిపై ఉన్న ప్రేమను చంపుకోలేనని భావించిన యువతి ఇక్కడకు వచ్చి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. సౌదీలోని తన ఇంటి నుంచి, అదే చిరునామాతో వీసాకు దరఖాస్తు చేస్తే విచారణ నిమిత్తం అధికారులు రావడం, సంప్రదింపుల నేపథ్యంలో విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందని భావించింది. అదే జరిగితే తనను భారత్‌కు వెళ్లనీయరని, అజీముద్దీన్‌ను వివాహం చేసుకోవడం సాధ్యం కాదని భావించిన ఆమె గత నెల విహారయాత్రకు వెళ్తున్నానంటూ ఇంటి నుంచి బయటికి వచ్చి నేపాల్‌కు చేరుకుంది.

అక్కడ నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించింది. రోడ్డు, రైలు మార్గాల్లో నిజామాబాద్‌ వెళ్లి అజీముద్దీన్‌ను కలుసుకుంది. గత నెల్లోనే వివాహం చేసుకున్న వీరిద్దరూ కాపురం పెట్టారు. ఓ సందర్భంలో నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌కు కలిసిన అల్‌ హర్బీ తాను తన ప్రియుడి కోసం అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించానని, వివాహం చేసుకున్న నేపథ్యంలో నిజామాబాద్‌లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంది. దీంతోపాటే తాను మేజర్‌నని నిరూపించే, తమకు వివాహమైనట్లు ధ్రువీకరించే పత్రాలు జత చేసింది. ఈ దరఖాస్తు నిజామాబాద్‌ పోలీసుల వద్ద పెండింగ్‌లో ఉంది. ఇలా ఉండగా... ఆమె కోసం గాలింపు చేపట్టిన కుటుంబసభ్యులు ఆమె తెలంగాణకు చేరుకుందని తెలుసుకుని, సౌదీ అధికారులను ఆశ్రయించగా, వారు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) దృష్టికి విషయం తీసుకువెళ్లారు. భారత్‌కు వచ్చిన అల్‌ హర్బీ తండ్రి, సోదరుడు ముంబైలోని సౌదీ ఎంబసీని ఆశ్రయించారు. ఆ అధికారులతో పాటు హైదరాబాద్‌లోని నోడల్‌ అధికారి సహాయంతో యువతి సంబంధీకులు గురువారం సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతికి ఫిర్యాదు చేశారు.

తన కుమార్తెను తమ వద్ద డ్రైవర్‌గా పని చేసిన అజీముద్దీన్‌ కిడ్నాప్‌ చేసినట్లు ఆరోపించారు. దీని ఆధారంగా కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. సాంకేతికంగా ముందుకు వెళ్ళిన ఈ టీమ్‌ అజీముద్దీన్, అల్‌ హర్బీ నిజామాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం అక్కడకు వెళ్ళిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువురినీ నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు తరలించారు. విచారణ నేపథ్యంలో తాను ఇష్టపూర్వకంగానే వచ్చానంటూ అల్‌ హర్బీ వెల్లడించింది. మరోపక్క ఇరువురూ భారత్‌కు వేర్వేరుగా, దాదాపు ఐదు నెలల వ్యవధిలో రావడంతో బెదిరించి తీసుకురావడం (కిడ్నాప్‌) కాదని నిర్ధారించారు. నిజామాబాద్‌ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా ఉన్న కామారెడ్డి ఎస్పీ శ్వేత రెడ్డి ఆమెను విచారిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొద్దిసేపు తాను ఇక్కడే ఉంటానని చెప్తున్న అల్‌ హర్బీ.. మరికొద్ది సేపు తిరిగి వెళ్ళపోతానని అంటోంది. అజీముద్దీన్‌ది పేద కుటుంబం కావడంతో సర్దుకుని జీవించడం ఆమె వల్ల కావట్లేదని అధికారులు చెబుతున్నారు. ఆ యువతి తిరిగి వెళతానని కోరితే ఎంబసీ అధికారుల సమక్షంలో తండ్రి, సోదరుడికి అప్పగించనున్నారు. అలాకాని పక్షంలో అక్రమంగా దేశంలోని ప్రవేశించి, అజీముద్దీన్‌ను వివాహం చేసుకున్న అల్‌ హర్బీకి ఇక్కడ నివసించడానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలా? చట్టపరంగా చర్యలు తీసుకోవాలా? అనే అంశాలపై తర్జనభర్జన పడుతున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement