' అనుమతికోసం ఇబ్బడి ముబ్బడిగా ఫైళ్లను పంపుతున్న అధికార యంత్రాంగం
' కోడ్ పరిధిలోకి వచ్చినా.. రాకున్నా సీఈవో కార్యాలయానికి..
' అనుమతి వచ్చాకే తనకు పంపాలన్న సీఎస్
' ఎన్నికల పనులు, ఫైళ్ల పరిశీలన మధ్య సీఈవో కార్యాలయ అధికారులు సతమతం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో తమ అనుమతి కోసం వచ్చిపడుతున్న ఫైళ్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం అధికారులకు కొత్త తలనొప్పి వచ్చింది. ఇన్ని రోజులుగా టెండర్లు, బదిలీల ఊసెత్తని పలు శాఖల అధికారులు.. ఒక్కసారిగా టెండర్లు పిలవడం, బదిలీలు చేపట్టడం కోసం అనుమతులు కోరుతూ ఫైళ్లు పంపడం ఇబ్బందిగా పరిణమించింది. రాష్ట్రంలో ప్రభుత్వం లేకపోవడం.. గవర్నర్ పాలనలో అధికార యంత్రాంగానిదే రాజ్యం కావడాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని.. అందులో భాగమే ఈ అకస్మాత్తు నిర్ణయాలనే ఆరోపణలు వస్తున్నాయి. ఇది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఉరుకులు, పరుగుల మీద ఈ వ్యవహారాన్ని నడిపిస్తుండడం గమనార్హం.
- ఆర్థిక సంవత్సరం చివరికి వచ్చాక ఇప్పుడు పలు జిల్లాల్లో రూ. 100 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణం కోసం టెండర్లను పిలవాలని రోడ్లు భవనాల శాఖ అధికారులు నిర్ణయించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆ ఫైలును సీఈవో అనుమతికి పంపారు. సీఈవో కార్యాలయం అధికారులు ఫైలును పరిశీలించి ఎటువంటి టెండర్లు పిలవరాదని స్పష్టం చేశారు.
- అలాగే ఇన్ని రోజులుగా జంట నగరాల్లోని పార్కులను పట్టించుకోని జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం.. ఇప్పుడు అత్యవసరంగా పార్కులను సుందరీకరించాలని నిర్ణయించింది. టెండర్లు పిలిచేందుకు అనుమతి కోరుతూ సీఈవోకు ఫైలును పంపింది. దీనిని కూడా తిరస్కరిస్తూ సీఈవో కార్యాలయం సిఫారసు చేసింది. హైదరాబాద్‌లోని శిల్పారామంలో పలు పనులు చేపట్టాలని పర్యాటక శాఖ నిర్ణయించింది.
- మరోవైపు ఎన్నికల బదిలీల ముసుగులో రవాణా శాఖ కమిషనర్లను బదిలీ చేసేందుకు తొలుత ఆ శాఖ మంత్రి ప్రయత్నం చేశారు. ఈ లోగా రాష్ట్రపతి పాలన రావడంతో మంత్రివర్గం రద్దయింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే, ఎన్నికల బదిలీల పరిధిలోకి రవాణా కమిషనర్లు రాకున్నా... ఆ ముసుగులో బదిలీలు చేయడం కోసం ప్రయత్నించారు. కానీ, ఈ ఫైలును పరిశీలించిన సీఈవో కార్యాలయం బదిలీలను తిరస్కరిస్తూ సిఫార్సు చేసింది.
- ఇలాంటి ఫైళ్లు పలు శాఖల నుంచి పెద్ద సంఖ్యలో సీఈవో కార్యాలయానికి వచ్చిపడుతున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణ పనుల్లో తీరిక లేకుండా ఉంటే మధ్యలో ఈ ఫైళ్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఈవో కార్యాలయ అధికారులు పేర్కొంటున్నారు.
- ఎన్నికల కోడ్ పరిధిలోకి వచ్చే ఫైళ్లను మాత్రమే కమిషన్ అనుమతి కోసం పంపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్ని శాఖలకు ముందే సూచించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మాత్రం ఫైళ్లన్నింటినీ తొలుత ఎన్నికల కమిషన్‌కు పంపాలని, అక్కడ లభించిన వాటినే తనకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.
- దీంతో ప్రతి ఫైలును అధికారులు సీఈవో కార్యాలయానికి పంపిస్తున్నారు. సీఈవో కార్యాలయం తన పరిధిలో ఫైళ్లపై నిర్ణయాన్ని వెలుబుచ్చుతూ.. తమ పరిధిలోకి రానివాటిపై కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనలను కోరుతోంది.
సీఈవోకు ‘ఫైళ్ల’ తలనొప్పి!
Published Tue, Mar 18 2014 3:27 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement