
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సహాయంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నెల జీతం రూ.3.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధి కి విరాళంగా అందజేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జగదీశ్వర్‌కు శనివారం ఆమె రాజ్‌భవన్‌లో ఈ మేరకు చెక్కు ను అందజేశారు. అంతకు ముందు ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. వలస కూలీలకు ఆహారం, వసతి సదుపాయం కల్పించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల దుస్థితిపై తన కార్యాలయానికి చాలామంది ఫి ర్యాదు చేస్తున్నారన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించడానికి ఐసీఎంఆర్ అనుమతి పొందిన ప్రైవేటు ఆస్పత్రులను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.