తెలంగాణ రైల్వేకు వెయ్యి కోట్లివ్వాలి
రైల్వే మంత్రికి ఎంపీ దత్తాత్రేయ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనుల కోసం 2014-15 బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించాలని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడకు విజ్ఞప్తి చేశారు. అత్యాధునిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని విన్నవించారు. తెలంగాణలో చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టుల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని గురువారం ఆయన రైల్వేమంత్రికి అందచేశారు. హైదరాబాద్- ఢిల్లీ, హైదరాబాద్- బికనీర్ మధ్య బుల్లెట్ రైళ్లను నడిపించాలని, సికింద్రాబాద్-బికనీర్, సికింద్రాబాద్ రాజ్‌కోట్‌ల మధ్య నడుస్తున్న సూపర్‌ఫాస్ట్ రైళ్లను ఇక మీదట రోజూ నడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సికింద్రాబాద్-కాజీపేట మధ్య మూడో లైను ఏర్పాటు చేయాలని, సికింద్రాబాద్-నాగపూర్ మార్గంలోని నిజామాబాద్, ఆదిలాబాద్ లైను విద్యుదీకరణ చేయాలని, కరీంనగర్-హసన్‌పర్తి లైనుకు నిధులు కేటాయించాలని ఆయన కోరారు. మణుగూరు-రామగుండం, భద్రాచలం-కొవ్వూరు, మెదక్-అక్కన్నపేట మధ్య కొత్త లైన్లను ఏర్పాటు చేయాలన్నారు.
హైదరాబాద్-మధురై (వయా తిరుపతి), సికింద్రాబాద్‌లో రాత్రి 9 గంటలకు బయలు దేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు బెంగుళూరు చేరేలా షెడ్యూల్‌తో కొత్త రైలును ఏర్పాటు చేయాలని, సికింద్రాబాద్-మహబూబ్‌నగర్, హైదరాబాద్-భద్రాచలం రోడ్, సికింద్రాబాద్-నల్లగొండ, కాజీపేట-కాగజ్‌నగర్‌ల మధ్య ఇంటర్ సిటీ, సికింద్రాబాద్-గోవా, హైదరాబాద్-ముంబై మధ్య సూపర్‌ఫాస్ట్ రైళ్లను ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.