
'వైఎస్ఆర్ సీపీ సభ్యులు టీడీపీలో చేరలేదు'
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరూ తెలుగుదేశం పార్టీలో చేరలేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరూ తెలుగుదేశం పార్టీలో చేరలేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ గుర్తుపై గెలిచి అనంతరం టీడీపీలో చేరినట్లు స్పీకర్ వద్ద కూడా ఎలాంటి ఫిర్యాదులు లేవని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.
కాగా పార్టీ మారిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ టీడీపీ నేతలు బుధవారం స్పీకర్ మధుసూదనాచారిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణమే చర్య తీసుకోవాలన్నారు. కడియం శ్రీహరి ఓ వైపు ఎంపీగా, మరోవైపు మంత్రిగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. తక్షణమే కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థ చట్టవిరుద్ధమని, దీనిపై హైకోర్టులో కేసు వేసినట్లు చెప్పారు. దొంగసాకులు చెప్పి రాజీనామాల విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు.