ఉద్యమాలు చేయని వారికి టికెట్లా!
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారికి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని జేఏసీ నాయకులు అన్నారు.
ఉద్యమంలో తెలంగాణవాదులను పోలీసులతో కొట్టించిన బాజిరెడ్డి గోవర్ధన్ , టీఆర్‌ఎస్‌లో చేరగానే తెలంగాణపై ఎక్కడిలేని ప్రేమను ఒలకబోస్తున్నారని జేఏసీ జల్లా చైర్మన్ గోపాల్‌శర్మ విమర్శించారు. పార్టీలు మారగానే బాజిరెడ్డిలాంటి వారు కడిగిన ముత్యాలు కాలేరని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం లో పాల్గొనని ధన్‌పాల్ సూర్యనారాయణగుప్త, ఆకుల లలితకు పార్టీలు టికెట్లు ఇవ్వ డం సిగ్గుచేటన్నారు.ఆదివారం జిల్లాకేంద్రం లోని టీఎన్‌జీవోఎస్ భవన్‌లో జేఏసీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల వారు పాల్గొన్నారని, ఎంతోమంది విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారన్నారు. తెలంగాణ ఉద్యమం లో ప్రజలతో మమేకం కాని వారు, ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు.
జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కొందరు బడా పెట్టుబడిదారులకు కొన్ని పార్ట్టీలు టికెట్లు ఇచ్చాయని, తెలంగాణ కోసం పోరాడిన వారిని ఏ పార్టీలు ఆదరించలేదన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ బరిలో నిలిచిన అభ్యర్థులు ముందుగా జిల్లాలోని 66 మంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి చివరి వరకు ప్రయత్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు,ఆపార్టీతో బీజేపీ పొత్తుపెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఆ రెండుపార్టీలకు జేఏసీ నుంచి ఎదురుగాలి తప్పదని అన్నారు.నిజామాబాద్ 48వ డివిజన్‌లోని స్వతంత్ర అభ్యర్థి బొబ్బిలి మాధురి ఇంటిపై జరి గిన దాడి ఘనటపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
అధికారపార్టీకి తొత్తుగా మారి మున్సిపల్ ఎన్నికల్లో ఓవర్ యాక్షన్‌కు పాల్పడిన నగర సీఐ సైదులను వెంటనే విధులనుంచి తొల గించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న 40 ప్రజా సమస్యలను పరిష్కరిం చేందుకు జేఏసీ పోరాడుతుందన్నారు. జేఏసీ తరపు న నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, బోధన్ అసెంబ్లీ స్థానాలకు బరిలో అభ్యర్థులను నిలుపుతామన్నారు.
సమావేశంలో జేఏసీ కన్వీనర్ గైని గంగారాం, ప్రభాకర్, భాస్కర్, టీఎన్‌జీవోఎస్ కార్యదర్శి కిషన్, వనమాల సుధాకర్, కుల సంఘాల జేఏసీ దయానంద్, సుదర్శన్‌రావు, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఆశనారాయణ, జర్నలిస్టు ఫోరం నాయకులు బాలార్జున్‌గౌడ్ పాల్గొన్నారు.