సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కుమారై ఇవాంకా పర్యటనను నిరసిస్తూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇవాంక రాకను వ్యతిరేకిస్తూ టీపీఎఫ్ ప్రదర్శన చేపట్టింది.
సదస్సు పేరుతో రూ.వందల కోట్లు ప్రజా ధనం వృథా చేస్తున్నారని ఈ సందర్భంగా ఆందోళనకారులు విమర్శించారు. పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో మన పాలకులు కీలుబొమ్మల్లా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీపీఎఫ్ నేతలు నలమాస కృష్ణ, రవిచంద్ర, మమత, రాణి, సంధ్య తదితరులను పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
‘జీఈఎస్’ ఎంట్రీపాస్‌ల గందరగోళం
సదస్సుకు హాజరుకాకుండానే వెనుదిరిగిన అనేక మంది విదేశీ డెలిగేట్లు
నగరంలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సదస్సులో పాల్గొనేందుకు విదేశాల నుంచి వచ్చిన వందలాది మంది డెలిగేట్లు నిర్వాహకుల అత్యుత్సాహం కారణంగా మంగళవారం తొలిరోజున ఎంట్రీ పాసులు లభించక గంటల తరబడి హైటెక్స్ ఆవరణలో పడిగాపులు పడ్డారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా తదితర దేశాల నుంచి వందలాది డెలిగేట్లు తరలివచ్చారు. వీరందరూ హైటెక్స్‌లోని జీఈఎస్ సమ్మిట్ జరిగే హాలు లోనికి ప్రవేశించేందుకు అవసరమైన పాస్‌ల జారీ విషయంలో నిర్వాహకులు పలు రకాల ప్రశ్నలతో డెలిగేట్లను వేధించారని..ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నవారు తమ మొబైల్‌లో ఆ వివరాలు చూపినా లోనికి అనుమతించలేదని నగరానికి చెందిన ఓ డెలిగేట్ ‘సాక్షి’తో ఆవేదన పంచుకున్నారు. ఒకసారి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆహ్వానం అందినవారిని భద్రతా కారణాల నెపంతో హైటెక్స్ ఆవరణలో భద్రతా విధుల్లో పాల్గొన్న సిబ్బందితోపాటు నీతిఆయోగ్ అధికారులు ఎంట్రీపాస్‌లు లేవంటూ లోనికి అనుమతించకుండా అమర్యాదగా ప్రవర్తించారని అసహనం వ్యక్తం చేశారు. కాగా రెండోరోజు సదస్సు నాటికి ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. కాగా తొలిరోజు సదస్సుకు లోనికి అనుమతి లేకపోవడంతో విదేశీ అతిథుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో తాము బస చేసిన హోటల్‌కు వెళ్లిపోవడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment