
టవర్లు తొలగించేలా ఉద్యమాలొస్తాయి
* టెలికం సర్వీస్ ప్రొవైడర్లను బెదిరించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు
* ‘ఓటుకు కోట్లు’లో తమకు అనుకూల అంశాలు బహిర్గతం చేయాలని ఒత్తిడి
* విజయవాడలో ముగిసిన ప్రొవైడర్ల విచారణ
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసుకు కౌంటర్‌గా నమోదైన కేసుల దర్యాప్తులో టెలికం సర్వీసు ప్రొవైడర్లను ఏపీ ప్రభుత్వం బెదిరిస్తోంది. సెల్ టవర్లు తొలగించేలా ప్రాంతాల వారీగా ఉద్యమాలు వస్తాయని, ఆ తరువాత మీరే నష్టపోవాల్సి వస్తుందని టెలికం సంస్థలను హెచ్చరిస్తోంది. విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్‌లో రెండో రోజైన మంగళవారం విచారణ కొనసాగించిన సిట్ బృందం.. సర్వీసు ప్రొవైడర్లను భయభ్రాంతులకు గురయ్యేలా బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. సిట్ శనివారం ఇచ్చిన నోటీసుల మేరకు టెలికం సర్వీసు ప్రొవైడర్లు సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరయ్యారు. నోటీసుల్లో అడిగిన ‘ట్యాపింగ్’ సంబంధిత వివరాలను నేరుగా ఇవ్వడం సాధ్యం కాదంటూ ప్రొవైడర్లు తేల్చిచెప్పడంతో.. కొందరు ‘ప్రభుత్వ పెద్దలు’ రంగంలోకి దిగి ప్రొవైడర్లను బెదిరించే ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసింది.
‘అనుకూల’ వివరాలివ్వండి..
సిట్ బృందం అడిగిన వివరాలతో పాటు తమకు అనుకూలంగా మారే అంశాలు ఉంటే వాటినీ బయటపెట్టాలని ప్రొవైడర్లపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. తాము చేసిన హెచ్చరికలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని, ఒక వేళ వస్తే సర్వీస్ ప్రొవైడర్లే స్వయంగా వాటిని ఖండించాలని చెప్పినట్లు సమాచారం. మరోపక్క సిట్ అధికారులు విజయవాడలో చేపట్టిన విచారణ మంగళవారంతో ముగిసింది.
దాదాపు 15 మంది అధికారులతో కూడిన బృందం ఒక్కో సర్వీసు ప్రొవైడర్‌ను నాలుగు నుంచి ఐదు గంటల పాటు విచారించింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి తెలంగాణ పోలీసులు రాసిన లేఖలు తమ వద్ద ఉన్నాయని, గడిచిన కొన్ని నెలలుగా తెలంగాణ అధికారులు చేపట్టిన ట్యాపింగ్స్ వివరాలు అందించాలని వారిపై సిట్ ఒత్తిడి తెచ్చిందని తెలుస్తోంది. వివరాలివ్వడం నిబంధనలకు విరుద్ధమే కాకుండా ఆ చర్య అధికారిక రహస్యాల చట్టం (ఓఎస్ యాక్ట్) ఉల్లంఘన కిందకి వస్తుందని టెలికం కంపెనీల ప్రతినిధులు చెప్పినా సిట్ పెడచెవిన పెడుతోంది.
ఈ తతంగాన్ని వీడియో రికార్డు చేస్తూ, ఇక్కడే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామంటూ పరుష పదజాలం వాడి సర్వీస్ ప్రొవైడర్ ప్రతినిధుల్ని బెదిరించినట్లు తెలిసింది. ఇలావుండగా, టెలికం సర్వీసు ప్రొవైడర్ల విచారణ అంకం ముగియడంతో దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను సిట్ చీఫ్ డీఐజీ ఇక్బాల్‌కు అందించడానికి ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఇక్బాల్‌తో పాటు డీజీపీ రాముడికీ ఈ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు మత్తయ్య కేసులో 20 రోజుల కాల్ డేటా ఇవ్వాలని కోరుతూ సీఐడీ పోలీసులు విజయవాడలోని మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.