తాటి ముంజలు తెగ తినేవాళ్లం..
బడికి పోయే రోజుల్లో వేసవి సెలవులంటే మస్త్ జోష్.. సెలవులొచ్చిన రోజు నుంచే మా ఆటలకు హద్దులుండేవి కాదు. ఫలానా ఆట అని లేకుండా.. ఏదితోస్తే అది ఆడేవాళ్లం. రోజూ ఉదయం మాత్రం ఊట బావిలో మున గాల్సిందే. ఆ సమయంలో మా అల్లరి అంతాఇంతా కాదు. బావి ఒడ్డునున్న చెట్లమీద నుంచి దూకిమరీ ఈత కొట్టేవాళ్లం. కేవలం మగపిల్లలే కాదు.. మాతో సమానంగా ఆడపిల్లలూ ఈతకు వచ్చేవాళ్ళు అని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి తను బాల్యంలో వేసవి సెలవుల్ని గడిపిన తీరును గుర్తుచేసుకున్నారు. అవన్నీ ఆయన మాటల్లోనే..
మా సొంతూరు మహబూబ్‌నగర్ జిల్లా పెదమందడి మండలం చినమందడి. పూర్తిగా గ్రామీణ వాతావరణం. వేసవి సెలవుల్లో పెద్దలు సైతం ఈత కొట్టేందుకుప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. అసలు బావిలో ఈత కొట్టడంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం. మా పొలం దగ్గరున్నది పేరుకే చినబావి. కానీ ఆ ప్రాంతంలో అదే పెద్దది. దాదాపు 50 మం దిదిగి స్నానం చేసేంత పెద్దది. ఈత కొట్టే సందర్భంలో స్నేహితులతో పందెం కాయడం సాధారణం. ఈ క్రమంలో తోటివారిని చేతులతో నీటిలో ముంచి. కాళ్లతో లోతుకు నెట్టేవాళ్లం. ఆ సందర్భంలో గొడవ లు జరిగినా..అవన్నీ బావివద్దకే పరిమితమయ్యేవి.
తాటి ముంజలు.. ఆట, పోటీలు
బావిలో ఈతకొట్టి బయటకొచ్చిన తర్వాత సమీపంలో ఉన్న తాటి చెట్ల నుంచి గుట్టుచప్పుడు కా కుండా ముంజలు తెచ్చుకునే వాళ్లం.వాటిని కత్తితో కాకుండా చేతి వేళ్లతో తొలిచి తినేవాళ్ళం.ఆ తర్వా త ఆ పొలాల పెద్దలు వచ్చి లొల్లి చేయడం జరి గేది.అయినా మా రూటు మారేది కాదు. ముంజ లు తిన్న తర్వాత వాటిని కట్టెకు అటు,ఇటు బిగిం చి బండిగా తయారు చేసేవాడిని.
చింపురు జుత్తు.. బెదరగొట్టే అవతారం..
ఇంట్లో నుంచి ఉదయం బయటకొచ్చామంటే తిరిగి సాయంత్రం నాలుగు తర్వాతే ఇంటికెళ్లేవాడిని. అప్పుడు మమ్మల్ని చూసి ఇంట్లోవాళ్లే భయపడిపోయేవారు. పొద్దంతా తిరగడంతో చింపురు జుత్తు.. మోహమంతా నల్లగా తయారయ్యేది. అలా బెదరగొట్టే అవతారంతో వెళ్లిన మమ్మల్ని చూసిన అమ్మ.. తలకు నూనె పెట్టి శుభ్రంగా తయారుచేసేది. ఆ సమయమంతా చివాట్లు పెట్టేది. భోజనంచేసి తిరిగి వీధిలోకి జారుకునేవాడిని. ఊర్లో సాయంత్రంవేళ నాటకాలు ఆడేవారు. నాటకం అర్థం కానప్పటికీ ఒక్కో నటుడు అలంకరించుకుని స్టేజీపైకి వచ్చే సందర్భంగా వారి ఎంట్రీకి మేమంతా గెంతేవాళ్లం. ఆ విధంగా ప్రతి అంశంలోనూ పాల్గొని ఆనందించేవాడిని. ఓసారి కబడ్డీ ఆడుతుండగా.. పొరుగు బృందం సభ్యుడు నన్ను పట్టుకున్నాడు. ఆ సమయంలో వాడి పన్ను నా తలకు గుచ్చుకోవడంతో పెద్దగాయమైంది. ఆ తర్వాత ఇప్పటికీ కబడ్డీ ఆడలేదు.
ఆ రోజేలే వేరు..
మా చిన్నతనంలో వేసవి సెలవులు గడిపిన తీరు ఒక అద్భుతం. ఇప్పటి జనరేషన్‌కు పిల్లలు వేసవి సెలవులు గడిపేతీరు పూర్తిగా వేరు. ఈత కొట్టడంలో వ్యాయమంతోపాటు శరీరం ధృడంగా అయ్యేది. ఇప్పుడు ఈత కొట్టడానికి బావులే లేవు. ఎంతసేపు వీడియోగేమ్స్.. కంప్యూటర్ క్లాస్‌లంటూ మళ్లీ బడివాతావరణాన్నే ఆస్వాదిస్తున్నారు. మేమై తే వేసవి సెలవుల్లో పుస్తకాలు ముట్టేవాళ్లమే కాదు.