దుబాయి వెళ్లే ముందు భార్యాబిడ్డలతో శ్రీనివాస్ సెల్ఫీ, ఇందులో ఎడమ వైపు ఉన్న పెద్ద కూతురు కావ్య, భార్య సుజాత ఇద్దరు చనిపోయారు (వృత్తంలో ఉన్నవారు)
ఉపాధి కోసం దుబాయి వెళ్లిన ఓ వ్యక్తి జీవితంలోవిధి విషాదం నింపింది. ఇండియాలో ఉంటున్న భార్య, బిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా..కరోనా ఆంక్షల నేపథ్యంలో అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోయాడు. స్నేహితుల సాయంతో ఇప్పుడు ఇండియాకుచేరుకున్నా నిబంధనల కారణంగా హైదరాబాద్‌లోనే క్వారంటైన్‌లో ఉండిపోయాడు. బతికి ఉన్న మరో కూతుర్ని కూడా ఓదార్చలేని స్థితిలో గుండెలవిసేలా రోదిస్తున్నాడు..లక్సెట్టిపేటకు చెందిన శ్రీనివాస్.
సాక్షి, సిటీబ్యూరో: కర్కశ కరోనా..ఆ కుటుంబం నిండా కన్నీళ్లు నింపింది. ప్రత్యక్షంగా వాళ్లు వైరస్ బారిన పడకున్నా, వైరస్ మోసుకొచ్చిన పరిస్థితులు ఈ కుటుంబాన్ని పూర్తి ఛిద్రం చేశాయి. ఒక వైపు ఊహించని ప్రమాదంలో మృతి చెందిన భార్య, కూతురు, మరో వైపు వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినా మిగిలిన ఒక్క కూతురును గుండెలకద్దుకుని ఓదార్చే పరిస్థితి లేకపోవడం ప్రతి హృదయాన్ని కలచివేస్తుంది. వివరాల్లోకి వెళితే.. లక్సెట్టిపేటకు చెందిన పోతరాజు శ్రీనివాస్ రెండున్నరేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయికి వెళ్లి క్లీనర్‌గా పనిచేశాడు. ఈయనకు భార్య సుజాత(38), కూతుళ్లు కావ్య(19), వైష్ణవి(17) ఉన్నారు. లక్సెట్టిపేటలోనే ఉంటున్న వీరు ఇటీవల ఓ ఫంక్షన్‌కు హాజరై తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో భార్య సుజాత, పెద్ద కూతురు కావ్య దుర్మరణం పాలయ్యారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలతో అదే రోజు మధ్యాహ్నం అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి అంత్యక్రియలు పూర్తి చేశారు. దుబాయిలో ఉన్న శ్రీనివాస్ వాట్సప్ వీడియో లైవ్‌లోనే భార్య, పెద్ద కూతురు అంత్యక్రియలను తిలకిస్తూ గుండెలవిసేలా రోధించాడు.
నగరంలో క్వారంటైన్‌లో ఉన్న శ్రీనివాస్
సాయం చేసిన స్నేహితులు...
దుబాయిలో ఉన్న శ్రీనివాస్‌కు ఇండియా వచ్చేందుకు నయా పైసా లేకపోవటంతో దిక్కుతోచని స్థితిలో ఉండగా.. ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సభ్యులు ఎంబసీ అధికారులతో మాట్లాడి, టికెట్ సైతం కొనుగోలు చేసి ఈనెల 22న హైదరాబాద్‌కు పంపారు. నిబంధనల మేరకు విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేయడంతో శ్రీనివాస్‌ను నాంపల్లిలోని ఓ హోటల్‌లో ఉంచారు. భార్య, పెద్ద కూతురు చనిపోవటం, మిగిలిన చిన్న కూతురు బిక్కుబిక్కు మంటూ తండ్రి కోసం ఎదురుచూస్తున్న సమయంలో మాజీ ఎంపీ కవిత చొరవతో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి శ్రీనివాస్‌ను ఆదివారం హైదరాబాద్ నుంచి లక్సెట్టిపేటకు పంపారు. కానీ కరోనా నిబంధనలతో చిన్న కూతురును సైతం పది మీటర్ల దూరం నుంచి చూసి ఓదార్చేందుకు అధికారులు అనుమతించారు. దూరం నుంచే చిన్న కూతురు వైష్ణవికి ధైర్యం చెబుతూ శ్రీనివాస్ మళ్లీ హైదరాబాద్‌లోని క్వారంటైన్ సెంటర్‌కు చేరుకున్నాడు.
మళ్లీ దుబాయి వెళ్లను..
‘ఇద్దరు కూతుళ్లకు మంచి చదువులు చెప్పించి, ఉన్న అప్పులు తీర్చేందుకు దుబాయి వెళ్లా. కానీ నాకిప్పుడు అంతా శూన్యంగా కనిపిస్తోంది. ఇక నేను ఎవరి కోసం మళ్లీ వెళ్లాలి సార్ దుబాయి..’ అంటూ శ్రీనివాస్ కన్నీళ్ల పర్యంతమైయ్యాడు. సోమవారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడుతూ.. ‘క్వారంటైన్ నుంచి విడిచి పెడితే ఇంటికి వెళ్లి నా చిన్నబిడ్డ వైష్ణవి, తల్లి లక్ష్మమ్మను ఓదారుస్తా. మళ్లీ ఆటో నడుపుకుంటూ బతుకుత’అని చెప్పాడు. ఇదే విషయమై గల్ప్ సంక్షేమ సంఘాల నాయకులు మందా భీంరెడ్డి, వాణిలు వేర్వేరుగా మాట్లాడుతూ రకరకాల కారణాలతో గల్ఫ్ నుండి మళ్లీ సొంత ఊళ్లకు వచ్చిన కార్మికులకు ప్రత్యేక పథకంతో ఉపాధి పథకాలకు తక్షణం రూపకల్పన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment