ఆగస్టులోనూ వాహన అమ్మకాలు అంతంతే...
ఆగస్టులోనూ వాహన అమ్మకాలు అంతంతే...
Published Mon, Sep 2 2013 1:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
న్యూఢిల్లీ: వాహనాల విక్రయాలు ఈ ఏడాది ఆగస్టులో మిశ్రమంగా ఉన్నాయి. అధిక వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఇంధనం ధరలకు ఇప్పుడు రూపాయి పతనం కూడా తోడయింది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగి వాహన కంపెనీలు ధరలను పెంచాయి. వీటన్నింటి వల్ల వాహన కంపెనీల అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో వాణిజ్య, ప్రయాణికుల వాహనాల అమ్మకాలు తగ్గాయని టాటా మోటార్స్ తెలిపింది. కాగా టయోటా అమ్మకాలు 6 శాతం తగ్గాయి. ఈ కంపెనీ అమ్మకాలు 16,225 నుంచి 15,201కు తగ్గాయి. వర్షాలు బాగా ఉన్నాయని, రానున్న పండుగల సీజన్‌లో వాహన విక్రయాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది.
ప్యాకేజీ తక్షణావసరం...
మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 17 శాతం తగ్గాయి. ఈ కంపెనీ అమ్మకాలు 45,836 నుంచి 37,897కు క్షీణించాయి. దేశీయ అమ్మకాలు 18 శాతం తగ్గాయి. త్రీ వీలర్ల అమ్మకాలు 14 శాతం, ఎగుమతులు 9 శాతం తగ్గాయి. వాహన పరిశ్రమ తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా పేర్కొన్నారు. స్వల్పకాలిక ఆర్థిక ప్యాకేజీ తక్షణావసరమని వివరించారు. ఇక యమహా మోటార్ ఇండియా అమ్మకాలు 67% వృద్ధి చెందాయి. గత ఆగస్టులో 36,432గా ఉన్న యమహా విక్రయాలు ఈ ఏడాది ఆగస్టులో 60,996కు పెరిగాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ అమ్మకాలు 0.57 శాతం పెరిగాయి. కంపెనీ విక్రయాలు 1,54,647 నుంచి 1,55,532కు వృద్ధి చెందాయి. టూవీలర్ల అమ్మకాలు 1.5 శాతం, స్కూటర్ల అమ్మకాలు 4 శాతం చొప్పున తగ్గగా, మోటార్ బైక్‌ల అమ్మకాలు 14 శాతం పెరిగాయి.
Advertisement