బజాజ్ ఫినాన్స్ బోనస్ బొనాంజా
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ బజాజ్ ఫినాన్స్ ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. జూన్ త్రైమాసికంలో అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేసింది. మంగళవారం కంపెనీ ప్రకటించిన క్యూ 1 ఫలితాల్లో 54 శాతం వృద్ధితో రూ.424 కోట్ల నికర లభాలను ఆర్జించింది. ఆదాయంలో 38 శాతం వృద్థితో రూ. 2,166 కోట్ల నికర ఆదాయాన్ని సాధించింది.
మెరుగైన ఫలితాలను ప్రకటించిన బజాజ్ ఫినాన్స్ బోర్డ్ 1:1 బోనస్ ప్రకటించింది. అలాగే 10రూ. గా ఫేస్ వాల్యూ వున్న షేరును విడగొట్టి (స్ప్లిట్) 2 రూ.నిర్ణయించింది. అంటే ప్రతీ షేరుకు అయిదు షేర్లు అదనంగా వాటాదారులకు అందించనుంది. దీంతో మార్కెట్లో ఈ కంపెనీ షేరు లాభాల్లో దూసుకుపోతోంది. ఈ బంపర్ బొనాంజాతో దాదాపు 5 శాతం లాభాలతో ఫ్లాట్ గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లో ప్రధాన విజేతగా నిలిచింది.
కాగా పుణేకు చెందిన బజాజ్ ఫినాన్స్ రూ.373కోట్ల నికర లాభాలను, 2039కోట్ల నికర ఆదాయన్ని నమోదు చేస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఈ అంచనాలకు భిన్నంగా బజాజ్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం విశేషం.