కోకిల మోసాలకు పక్షుల చెక్!!
కోకిల.. ఎంత సుమధురంగా పాడుతుందో అంత బద్ధకంగా ఉంటుంది. తాను పెట్టిన గుడ్లను పొదగాలంటే కూడా దానికి మహా బద్ధకం. అందుకే.. కాకుల్లాంటి ఇతర పక్షుల గూళ్లలో వాటికి తెలియకుండా వెళ్లి గుడ్లు పెట్టేసి వస్తుంది. ఆ విషయం తెలియని కాకి.. తన గుడ్లతో పాటు వాటిని కూడా పొదుగుతుంది. పిల్లలు బయటకు వచ్చే వరకు దానికి అసలు సంగతి తెలియదు. ఈ విసయం కొన్ని తరాలుగా అందరికీ తెలిసినదే. కానీ.. ఇన్ని తరాల తర్వాత ఇప్పుడు కాకులతో పాటు ఇతర పక్షులు కూడా తెలివి నేర్చుకున్నాయి. తమ గుడ్లేవో, కోకిల గుడ్లేవో తెలుసుకోడానికి ప్రత్యేక ఏర్పాట్లను అవి చేసుకుంటున్నాయి.
ఫొటోలను ఎవరూ కాపీ కొట్టకుండా దాని మీద వాటర్ మార్క్ వేయడం అందరికీ తెలుసు కదూ. అచ్చం అలాగే ఇప్పుడు ఇతర జాతుల పక్షులన్నీ కూడా ఇలాంటి సరికొత్త టెక్నిక్లు నేర్చుకున్నాయట. ఈ విషయం తమ పరిశోధనలో తేలిందని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మేరీ కాస్వెల్ స్టాడార్డ్ తెలిపారు. కోకిలలు కేవలం కాకులనే కాదు.. ప్రధానంగా ఎనిమిది రకాల పక్షులను ఎంచుకుని, వాటి గూళ్లలో తమ గుడ్లు పెడుతుంటాయి. ఈ ఎనిమిది రకాల పక్షుల గుడ్లను శాస్త్రవేత్తలు కంప్యూటర్ ఆధారిత పరికరాలతో నిశితంగా పరిశీలించారు. అప్పుడు.. వాటిమీద ఉన్న పిగ్మెంటేషన్లలో మార్పులు గమనించారు. వీటిని ఆయా పక్షులు సాధారణ కంటితోనే గుర్తించగలవు. కొన్ని పక్షులు ఒకేరకం మచ్చలున్న గుడ్లను పెడుతుంటే, మరికొన్ని జాతులు మాత్రం పక్షికి పక్షికి కూడా ఈ పిగ్మెంటేషన్లను మార్చేస్తున్నాయి.