25న ‘వయోశ్రీ యోజన’ షురూ | Different devices distributed free of charge to Poor the elderly | Sakshi
Sakshi News home page

25న ‘వయోశ్రీ యోజన’ షురూ

Published Mon, Mar 20 2017 3:51 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

Different devices distributed free of charge to Poor the elderly

పేద వృద్ధులకు ఉచితంగా వివిధ పరికరాల పంపిణీ
నెల్లూరు జిల్లాలో ప్రారంభం కానున్న పథకం


న్యూఢిల్లీ: దారిద్య్రరేఖకు దిగువున ఉన్న వృద్ధులకు (60 ఏళ్లకు పైబడిన వారు) ఉచితంగా వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, కళ్లజోళ్లు వంటి సహాయక పరికరాలు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ. 477 కోట్లతో ‘రాష్ట్రీయ వయోశ్రీ యోజన’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని ఈ నెల 25వ తేదీన ఏపీలోని నెల్లూరు జిల్లాలో కేంద్ర మంత్రులు తావర్‌ చంద్‌ గెహ్లాట్, ఎం. వెంకయ్యనాయుడులు ప్రారంభించనున్నారు. ఈ నెల 26న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఈ క్యాంప్‌ నిర్వహించనున్నారు.

పేద వృద్ధులు చురుకైన జీవితం జీవించేలా చూడటం, పెద్దలకు అనుకూలమైన సమాజాన్ని నిర్మించడమే ఈ పథకం ఉద్దేశమని కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారత శాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఒక్కో క్యాంపులో 2,000 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి పరికరాలు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్యాంపులను ఏడాదిలో రెండు జిల్లాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో లబ్ధిదారులను గుర్తించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గతేడాది డిసెంబర్‌లోనే కేంద్ర మంత్రి లేఖలు రాసినట్లు వివరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 10.38 కోట్ల మంది వృద్ధులు ఉన్నారు. వీరిలో 5.2 శాతం మంది వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.

Advertisement
Advertisement