ట్రంప్ కారులో ఏమున్నాయో తెలుసా?
Published Thu, Mar 2 2017 12:06 PM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM
అమెరికా లాంటి అగ్రరాజ్యానికి అధ్యక్షుడంటే ఆషామాషీ విషయం కాదు. ఆయన భద్రత కోసం అత్యంత భారీ ఏర్పాట్లు ఉంటాయి. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు ఆయన ఉపయోగించే కారు విషయంలో అక్కడి అధికారులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. ట్రంప్ కొత్త కారును అందరూ ముద్దుగా 'బీస్ట్' అని పిలుచుకుంటారు. ఇది 1.2ఎం కాడిలాక్ కారు. దీని డోర్ల మందం 8 అంగుళాలు. రోడ్డుమీద ఈ కారు వెళ్తుంటే దాని పక్కనే శక్తిమంతమైన బాంబు పేలినా లోపలున్నవాళ్లకు ఏమీ జరగదు. అలాగే, ఒకవేళ రసాయన ఆయుధాలతో దాడి చేసినా.. ఏమాత్రం ఇబ్బంది కలగకుండా లోపల ఆక్సిజన్ అందించే వ్యవస్థ ఉంది.
జనరల్ మోటార్స్ సంస్థ ఈ కారును సిద్ధం చేస్తోంది. వాస్తవానికి జనవరిలోనే దీన్ని ఇవ్వాలని అనుకున్నా, ఈ నెలాఖరుకు అందుతుందని చెబుతున్నారు. ఇలాంటివి మొత్తం 12 కార్లు ఉంటాయి. వీటి ఖరీదు దాదాపు వంద కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లు ఇవేనని అంటున్నారు. ఒక్కో కారు బరువు 8 టన్నులు ఉంటుంది. బోయింగ్-757 విమానానికి ఉండేలాంటి తలుపులు ఉంటాయి. ఇవి జీవ, రసాయన దాడులను సైతం తట్టుకోగలవు. కవచాలను చీల్చగల బుల్లెట్లను సైతం కారు ముందు అద్దం ఆపగలదు. దాని మందం ఐదు అంగుళాలు.
కారు కింది భాగం కూడా అత్యంత పటిష్ఠంగా ఉండటంతో.. దాని కింద బాంబు పేలినా కిందిభాగం గానీ, ఇంధన ట్యాంకు గానీ ఏమాత్రం చెక్కుచెదరవు. డ్రైవర్‌కు పక్కసీటు పక్కనే తలుపు వద్ద అత్యాధునిక ఆయుధాలు, ట్రంప్ గ్రూప్ రక్తం ప్యాకెట్లు సిద్ధంగా ఉంటాయి. అత్యవసరంగా ఆయనకు రక్తం ఎక్కించాల్సి వచ్చినా ఎక్కడా ఆగాల్సిన అవసరం లేదు. కారు ముందుభాగంలోని బంపర్ల వద్ద టియర్ గ్యాస్ గ్రెనేడ్ లాంచర్లు ఉంటాయి. ఎవరైనా గుంపుగా వచ్చి కారు ఆపినా, వెంటనే కారులోంచే బాష్పవాయు గోళాలు ప్రయోగించవచ్చు. హెడ్‌లైట్ల పక్కనే నైట్ విజన్ కెమెరాలు ఉంటాయి. వెనుక భాగంలో అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంటాయి. ఇక కారు డ్రైవర్‌కు ప్రత్యేకంగా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు శిక్షణ ఇస్తారు. క్లిష్టపరిస్థితులు తలెత్తినప్పుడు 180 డిగ్రీల జె టర్న్‌తో కారును తప్పించగల సామర్థ్యం కూడా ఉంటుంది. అతడి వద్ద ఉండే డాష్ బోర్డులో కమ్యూనికేషన్ సెంటర్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటాయి. కారులోనే చిన్నపాటి సెల్ టవర్ కూడా ఉంటుంది.
Advertisement