అసెంబ్లీకి నాలుగు రోజులు తాళం వేయాలి
హైదరాబాద్: ‘‘నో రూలింగ్ పార్టీ.. నో అపోజిషన్.. ప్రతి ఏడాది అసెంబ్లీలో ప్రజా అంశాలపై చర్చ జరగాలి. ముఖ్యంగా పాఠశాల విద్యపై ప్రత్యేక చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే అసెంబ్లీకి నాలుగు రోజులు తాళం వేసి పాఠశాల విద్యపై అన్ని రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలి’’ అని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల బాగోగులకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యత వహించాలన్నారు.
ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది, పనితీరుపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని, అప్పుడే సర్కారీ బడులు బలోపేతమవుతాయని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 29వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను మంత్రి ఈటల రాజేందర్, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌లతో కలిసి గవర్నర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రజాకవి సుద్దాల హనుమంతు వేదికపై ప్రసంగిస్తూ.. నగరం సంస్కృతి, గొప్పతనం ఆ నగరంలోని పుస్తకాల షాపుల సంఖ్యను బట్టి చెప్పవచ్చన్నారు. విద్యార్థులకు పాఠశాల విద్య నుంచే పుస్తక పఠనంపై అవగాహన పెంచాలని సూచించారు. మన చదువుల్లో ఐఐటీ, ఐఐఎంలకు ఎలా ప్రిపేర్ కావాలో చెబుతున్నారుగానీ మన చ రిత్ర గురించి చెప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పాఠశాలలో కావాల్సిన ఫర్నిచర్, పుస్తకాలు, ఉపాధ్యాయులు, మంచినీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు కల్పించాలని సూచించారు.