
'ఏకే 49తో దేశానికే ప్రమాదం'
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఏకే 49గా గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అభివర్ణించారు. బుధవారం జమ్మూ కాశ్మీర్ లోని కట్రా పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని మోడీ ప్రాంరభించారు. ఈ సందర్భంగా ఆయన కేజ్రీవాల్పై తన దైన శైలిలో విమర్శించారు.ఆయన కన్వీనర్గా గల ఆప్ పార్టీ సంఘ వ్యతిరేక శక్తిగా అవరించిందని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లేకుండా భారత్ దేశ చిత్ర పటాన్ని ఆ పార్టీ అధికారిక వెబ్సైట్లో ఉంచిన ఘనత 'ఆప్' సొంతమని మోడీ వ్యాఖ్యానించారు.
అలాంటి పార్టీ నేత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రిఫరెండం నిర్వహించాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. దేశానికి మూడు ఏకేలతో ప్రమాదం ముందని ఆయన హెచ్చరించారు.ఆ మూడు ఏకేలు... రైఫిల్ ఏకే 47, దేశ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని, అరవింద్ కేజ్రీవాల్(ఏకే) అంటూ ఆయన చమత్కరించారు.ఆ మూడు ఏకేలు పొరుగుదేశమైన పాకిస్థాన్కు సహకరిస్తున్నాయని మోడీ ఈ సందర్భంగా ఆరోపించారు.
న్యూఢిల్లీ శాసనసభకు గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ 28 సీట్లు కైవసం చేసుకుంది. అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేవలం 49 రోజులు మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. దాంతో అరవింద్ కేజీవ్రాల్ ను ఏకే 49గా మోడీ అభివర్ణించారు. వచ్చే నెలలో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో మోడీ వారణాసి నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆ స్థానం నుంచే మోడీ ప్రత్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నిక బరిలో నిలవనున్నారు.