పెద్ద నోట్ల రద్దుపై పెల్లుబికిన ఆందోళన
పెద్ద నోట్ల రద్దుపై పెల్లుబికిన ఆందోళన
Published Wed, Nov 23 2016 12:17 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
అధిక విలువ కలిగిన పాత కరెన్సీ నోట్ల రద్దుపై విపక్షాలన్నీ బుధవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాయి. పార్లమెంటు వెలుపల భారీ ధర్నా నిర్వహించాయి. మీడియా స్టాండ్ నుంచి గాంధీ విగ్రహం వరకూ విపక్ష సభ్యులు మానవహారం పాటించారు. పెద్దనోట్ల రద్దుపై పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశం మొత్తం నగదు మార్పిడి కోసం బ్యాంకుల ముందు నిలబడుతోందని అందుకే తాము కూడా పార్లమెంటు ముందు నిలబడుతున్నామని చెప్పారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దుపై చర్చకు స్పీకర్ సహకరించడం లేదని అన్నారు. ప్రధానమంత్రి వచ్చారా? లేదా? అన్నది కాదని చెప్పుకొచ్చిన రాహుల్.. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇచ్చారా? లేదా అన్నదే ముఖ్యమని అన్నారు.
దాదాపు 200 మందికి పైగా ఎంపీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రెయిన్, జనతాదళ్(యూనైటెడ్) నాయకుడు శరద్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు ఉన్నారు. సీపీఐ రాజ్యసభ సభ్యుడు సీతారం ఏచూరి మాట్లాడుతూ.. పార్లమెంటుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి సమాధానం చెప్పకుండా రాజ్యాంగ నిబంధలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు.
Advertisement