రాజ్యసభ మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ : రాజ్యసభలో మంగళవారం వాయిదాల పర్వం కొనసాగుతుంది. మధ్యాహ్నం 12.00గంటలకు ప్రారంభమైన సభ వెంటనే 2.00 గంటలకు వాయిదా పడింది. బీజేపీకి చెందిన కేంద్రమంత్రితో పాటు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టిన పట్టువిడవకపోవడంతో రాజ్యసభ ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్పై రాజ్యసభ దద్దరిల్లింది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్పై ఎత్తివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెల్లో దూసుకు వెళ్లి ఆందోళనకు దిగారు. దాంతో ఛైర్మన్ స్థానంలో ఉన్న పి జె కురియన్ మీ స్థానాలకు వెళ్లాలంటూ ఆదేశించారు. అయితే కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఆందోళనకు మిగతా ప్రతిపక్ష సభ్యులు మద్దతు తెలిపారు. దాంతో మధ్యాహ్నం 12.00 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు కురియన్ ప్రకటించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే నాటి నుంచి బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజె, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ రాజీనామాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ క్రమంలో సోమవారం లోక్ సభ ప్రారంభం కాగానే సదరు బీజేపీ నేతల రాజీనామాపై కాంగ్రెస్ పట్టుపట్టింది. అందుకు అధికార బీజేపీ ససేమిరా అంది. దాంతో సభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో 25 మంది కాంగ్రెస్ ఎంపీలపై లోక్ సభ స్పీకర్ 5 రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేటు వేశారు. అందుకు నిరసనగా రాజ్యసభలో ఎంపీలు ఆందోళనకు దిగారు.